Breaking News
Home / States / Andhra Pradesh / చేతకాకపోతే దిగిపోండి

చేతకాకపోతే దిగిపోండి

కాంట్రాక్టుల రద్దు, ఇసుక అమ్మడం
ఇవి తప్ప జగన్‌ చేసిందేమీ లేదు
కనీసం ఉల్లి ధరా నియంత్రించలేదు
ఆయనది మాట తప్పని కులమా?
మిగతావి తప్పే కులాలా?
మా వాళ్లపై దాడులు చేస్తే ఊరుకోను
కుటుంబాన్ని వదిలేసైనా వస్తా
151 సీట్లు వచ్చాయని విర్రవీగొద్దు
తెగించేందుకు సిద్ధంగా ఉన్నాం
తిరుపతి పర్యటనలో పవన్‌ హెచ్చరిక
తిరుపతి: ‘అభివృద్ధి పనుల కాంట్రాక్టులు రద్దు చేయడం, ఇసుక అమ్ముకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం ఆరునెలల్లో చేసింది ఏమీ లేదు. కనీసం ఉల్లి గడ్డల ధరలు నియంత్రించలేని పాలన సాగిస్తోంది. పాలించడం చేతకాకపోతే దిగిపోండి..’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. రాయలసీమ పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం తిరుపతిలోని రైతుబజారును సందర్శించారు. రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. ఆకాశాన్నంటుతున్న ఉల్లిపాయల ధరల గురించి పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎర్రగడ్డల ధర పెరిగినా రైతులెవరికీ లాభం లేదని, కేవలం దళారీలు దోచుకుంటున్నారని పవన్‌ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఆరు నెలల్లోనే ప్రజల్లో ఇంతటి అసహనం తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఇక పాలన కొనసాగించడానికి పనికిరాదన్నారు. అనంతరం కడప, రాజంపేట నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్‌పై పవన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ సందర్భంగా ఏమన్నారంటే..

అలా మాట్లాడుతుంటే నవ్వొస్తోంది..
‘మానవత్వం మా మతం. మాట తప్పదు మా కులమని చెప్పుకొంటున్న జగన్‌రెడ్డి మనుషులు రాయలసీమలో ప్రత్యర్థుల బత్తాయి, మామిడి చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. ఇదేనా మానవత్వం? ఆయన కులం మాట తప్పదంటే తక్కిన కులాలు మాట తప్పుతాయని అర్థమా? ఇలాంటి వ్యక్తులకు నాయకత్వం వహించే జగన్‌ మానవత్వం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. జనసేన నాయకులపంటలను ధ్వంసం చేస్తున్నారు. కార్యకర్తలను యాక్సిడెంట్‌ పేరుతో చంపేస్తున్నారు. ఇ లా చేస్తుంటే చూస్తూ ఊరుకునేదిలేదు. మానవత్వం మీ మతమైతే ఒక మతాన్ని చంపేసి ఇంకో మతాన్ని వెనకేసుకుని రావడం కాదు. అన్ని మతాలు, కులాలు కలిసిమెలిసి ఉండాలి.’

ఇది సింహాల సీమ..
‘కర్నూలు అహోబిలంలో నరసింహస్వామి వెలిశాడు. స్వార్థంతో నిండిపోయిన అసురుడైన హిరణ్యకశిపుడిని చంపేందుకు స్తంభం నుంచి ఉద్భవించాడు. ప్రకృతి ఏదో ఒక రూపంలో బయటకు వచ్చి అసుర సంహారం చేస్తుంది. అలాంటి నేల ఇది. మీకు భయం వేసినప్పుడు నరసింహస్వామిని తలుచుకోండి. ఇది రాయలసీమ కాదు.. సింహాల సీమ. మీరు సింహాలుగా ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని ఆయుధాలతో వచ్చినా రమ్మనండి. మీ కోసం నేను ముందుంటాను. సీమలో నేను పుట్టకపోయినా పౌరుషంలో తక్కువ లేదు. సీమలోని ఓ గ్రామం పేరు ‘కొణిదెల’ నా ఇంటిపేరు. మాపై దాడులు చేసిచూడండి. అన్నీ వదిలేస్తా. చివరికి బిడ్డల్ని కూడా. నాతోపాటు నడుస్తున్న అన్న నాగబాబును కూడా. వైసీపీ నేతలు వారి కుటుంబాలను వదిలి రాగలరా?’

ప్రజలు తరిమికొడతారు..
‘గతంలో కూడా చాలా గొప్పగొప్ప సామ్రాజ్యాలు వచ్చాయి. వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజలు వాటిని తరిమికొట్టిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. 151 సీట్లు వచ్చాయని విర్రవీగితే తెగించేందుకు సిద్ధంగా ఉన్నాం. మార్పు రావాలంటే తెగించాలి. కయ్యానికి కాలుదువ్వకండి. కానీ మన మీదకు వస్తే సంఘటితంగా నిలబడండి. మనలోని అనైక్యతే వారి బలం. ఎన్నికలప్పుడు అనంతపురంలో పోరాట యాత్ర పెడితే 3.5 లక్షల మంది జనం వచ్చారు. కానీ అవి ఓట్లుగా రాలేదు. ఒక్క రోజులో మార్పు రాదు. ఇలాంటి సమూహాన్ని ఎదుర్కోవాలంటే బలమైన నాయకత్వం కావాలి. ముందు నేను నిలబడాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా వెన్నుచూపను.’

నేను ప్రధాని వద్దకు వెళ్లి ఉంటే..
‘ఎన్నికలకు ముందు నేను సిద్ధాంతాలను పక్కనపెట్టి ప్రధాని దగ్గరకు వెళ్లి ఉంటే వైసీపీ బయటకు వచ్చిఉండేదా? వ్యూహాలు వేయలేక కాదు. తెలివి లేకపోవడం కాదు. అందరిలా అబద్ధాలు ఆడలేను. నేను నిబద్ధతగా ఉండాలనుకున్నా కాబట్టే వైసీపీ గెలిచింది. ఎన్నికల తర్వాత నిజంగా వైసీపీ బలంగా ఉండిఉంటే లాంగ్‌మార్చ్‌కు 2 లక్షల మంది ప్రజలు మనకు వచ్చి ఉండరు.’

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *