భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికై తలపెట్టిన గ్రామ ప్రణాళిక – కార్యాచరణలో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్లు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు పల్లెల ప్రగతి గురించి ప్రత్యేకించి 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని మంత్రులు అన్నారు. గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలాగే భావించి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
సమీక్ష సమావేశానికి ముందు మంత్రుల బృందం ఖమ్మంలోని గాంధీ చౌక్ సర్కిల్లో గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ బాలసాని అక్ష్మీ నారాయణ, మేయర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.