Breaking News
Home / Sports / పేదరికం ఆమె ప్రతిభను తొక్కిపెడుతోంది

పేదరికం ఆమె ప్రతిభను తొక్కిపెడుతోంది

వరంగల్: పేదరికం ఆమె ప్రతిభను తొక్కిపెడుతోంది. రింగ్‌లోకి దిగి ప్రత్యర్థులతో తలపడాల్సిన ఆ బాలిక పంట పొలాల్లో కొడవలి పట్టి కూలి పనిచేస్తోంది. జూడో క్రీడలో జాతీయ స్థాయిలో రాణించినా ప్రోత్సాహం కరవైంది. ఆమె పట్టుదల, కసి… అన్నిటికీ మించి నైపుణ్యం పాఠశాల ఉపాధ్యాయులను ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఆశలు, ఆవేదన చేతల్లో తప్ప మాటల్లో వ్యక్తం చేయలేని మూగ బాలిక ఆమె. కూలి పనికి ఎందుకు వెళ్తున్నావంటే ట్రాక్‌ సూట్‌ చూపిస్తూ ఇందుకోసమేనంటూ సైగలతో వివరిస్తున్న దృశ్యం క్రీడాభిమానులను కదిలిస్తోంది. జూడోలో జాతీయ స్థాయిలో రాణించినా సరైన ప్రోత్సాహం లేక వ్యవసాయం‌ చేసుకుంటున్న వరంగల్ క్రీడాకారిణి అశ్విని స్టోరీ.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన బాబు-లక్ష్మి దంపతుల కుమార్తె యాకర అశ్విని జాతీయ స్థాయి జూడోలో రాణిస్తోంది. పూట గడవడమే కష్టమైన కుటుంబ నేపథ్యం ఆమెది. నందనం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జూడోలో విశేషంగా రాణిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు వీరస్వామితో పాటు మిగతా ఉపాధ్యాయులంతా జూడో పట్ల పిల్లలకు ఆసక్తిని పెంపొందించారు. ఆ సమయంలోనే అశ్విని వారి దృష్టిని ఆకర్షించింది. అశ్విని సహజంగా బిడియం, బెరుకుతో ఉండే అమ్మాయి. అయితే, ఆటపై ఎంతో మక్కువ కలిగిన ఆమె.. కోచ్‌ ఇచ్చే సైగలను అర్థం చేసుకుంటూనే చక్కని ప్రతిభను కనబరుస్తోంది. మూగ బాలిక కావడంతో ఆమెను ఉపాధ్యాయులు మరింత ఆప్యాయంగా చూసుకునేవారు.

ప్రధానోపాధ్యాయురాలు నాగకుమారి, ఇతర ఉపాధ్యాయులంతా కలిసి అశ్విని జాతీయ పోటీలకు వెళ్ళేందుకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేవారు. నిరంతర సాధనతో అశ్విని క్రమంగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది. 2015, 2016 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల 35 కిలోల విభాగంలో వరుసగా మొదటి స్థానాలు సాధించింది. 2017లో కూడా 40 కిలోల విభాగంలో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత 2015 మార్చిలో గోవాలో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ జూడో (మూగ) పోటీల 35 కిలోల విభాగంలో రజత పతకం నెగ్గింది. 2016 లక్నోలో జరిగిన సబ్‌ జూనియర్‌ పోటీల్లో, హరియా ణాలోని గురుగావ్‌లో తెలంగాణ జట్టు నుంచి పాల్గొని ప్రతిభను కనబరిచింది.

ఏడో తరగతిలో జూడో ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన అశ్విని ప్రస్తుతం ఇంటర్‌ చదువుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని పేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలను అనుభవించింది. తల్లిదండ్రులతో కలిసి ఇసుక నింపే పనులకు వెళ్లేది. ప్రస్తుతం సెలవు రోజుల్లో తల్లితో పాటే పత్తి ఏరడం, వరి కోయడం వంటి కూలి పనులకు వెళుతోంది. వచ్చిన డబ్బుతో ఏం చేస్తావని ఎవరైనా అడిగితే మంచి ట్రాక్‌ సూట్‌ కొనుక్కుంటానని పాత ట్రాక్‌సూట్‌ను చూపించి మురిపెంగా చెబుతోంది. కనీసం ఆటకోసం అవసరమయ్యే తిండి, దుస్తులు కూడా కొనివ్వలేని పేదరికం తమదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూగ అయినా సైగలతో తాను చెప్పిన మెళకువలన్నీ అద్భుతంగా నేర్చుకుందని, జూడో ఆటపట్ల అశ్వినికి ఉన్న అంకితభావం, పట్టుదల గొప్పవని కోచ్ చెబుతున్నారు. జూడో నేర్చుకోవడం కోసం కఠోర శ్రమ చేసేదని, జూడో మెళకువలు సైగలతో చెబుతుంటే మిగిలిన పిల్లలకంటే వేగంగా అర్థం చేసుకునేదన్నారు. అశ్వినిని ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తిపతాకను ఎగురవేస్తుందని కోచ్‌ కమ్‌ పీఈటీ బొల్లెపల్లి వీరస్వామి చెబుతున్నారు. తనకు ఏది ఇష్టం అంటే జూడో అంటూ సైగలతో ఆనందంగా చెబుతూ జూడో పేరు వింటేనే కళ్లల్లో కోటి కాంతుల వెలుగులతో సంబరపడుతున్న అశ్వినిని ప్రోత్సహించాల్సిన అవసరం‌ ఎంతైనా ఉంది.

అశ్వినికి సాయం చేయాలనుకునేవారు 7893000492 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. విరాళాలు పంపాలనుకునేవారు ఆమె బ్యాంక్ అకౌంట్‌ నెంబర్ 36056706253‌కు పంపవచ్చు. ఐఎఫ్ఎస్‌సి కోడ్: ఎస్‌బిఐఎన్ 0020303

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *