అమరావతి: రాష్ట్ర పాలనలో తనదైన ముద్రవేయాలని పరితపిస్తున్న సీఎం జగన్ మరోసారి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి పాలన పరంగా కచ్చితమైన తేడా కనిపించాలంటూ అధికారులకు స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నాటికి అన్ని సచివాలయాలు పని ప్రారంభించాలని, కొత్త సంవత్సరంలో అర్హులకు కొత్తగా పింఛన్లు, రేషను కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి 500 రకాల పౌరసేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముఖ్యంగా, ఇసుక మాఫియాపై కఠిన వైఖరి అవలంబించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్రంలో ఇసుక మాఫియా కనిపించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇసుక కొరత తీర్చే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అక్రమ రవాణా నిరోధించాలని తెలిపారు. ఇసుక రవాణాలో రాజకీయ జోక్యం ఉండకూడదని, పొరుగు రాష్ట్రాలకు ఇసుక రవాణాపై చెక్ పోస్టుల వద్ద నిఘా ఉంచాలని పేర్కొన్నారు.