Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ‘ప్రైవేటు’ మద్యం నేటితో బంద్‌

‘ప్రైవేటు’ మద్యం నేటితో బంద్‌

షాపులను ఖాళీ చేస్తున్న వ్యాపారులు
1వ తేదీ నుంచి ప్రభుత్వ షాపుల్లోనే మద్యం
ప్రభుత్వ ఆధ్వర్యంలో 3,448 దుకాణాలు
అమరావతి: రాష్ట్ర రాజకీయాలను.. ప్రభుత్వ ఖజానాను ప్రభావితం చేసిన మద్యం అమ్మకాల్లో ఇకపై సమూల మార్పులు రానున్నాయి. ప్రైవేటు మద్యం షాపులు కనుమరుగై.. వాటి స్థానంలో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మద్యం దుకాణాలకు సెప్టెంబరు 30వ తేదీ అంటే సోమవారమే చివరి రోజు. మంగళవారం (1వ తేదీ) నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. సరుకునంతా విక్రయించేసి షాపులను ఖాళీచేసే పనిలో ప్రైవేటు మద్యం వ్యాపారులు బిజీగా ఉండగా, ఎక్సైజ్‌ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరుకు నింపి.. సిబ్బందిని సమకూర్చుకుని.. కొత్తగా అమ్మకాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సంధి కాలంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరక్క.. దొరికినా ఇష్టమైన బ్రాండు లభించక మందు బాబులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయి. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి.. 3,448 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తోంది.

ప్రైవేటు మద్యం వ్యాపారం 1995 సంవత్సరంలో మద్య నిషేధం సమయంలో మాత్రమే ఆగింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పూర్తిగా ప్రైవేటు మద్యం రద్దవుతోంది. నేటితో లైసెన్సులు అయిపోతున్నందున ప్రైవేటు వ్యాపారుల సరుకును దాదాపుగా ఇప్పటికే ఖాళీ చేశారు. ఆదివారమే అనేక షాపుల్లో మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. కేవలం షాపుల్లో మిగిలిపోయిన బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. గతంలో పాలసీ గడువు ముగిసినా మళ్లీ ప్రైవేటు వ్యాపారులే వస్తారు కాబట్టి, పాత వ్యాపారులు సరుకును కొత్తవారికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ షాపుల వల్ల ఆ అవకాశం లేదు. దీంతో ప్రైవేటు మద్యం షాపులన్నీ ఖాళీ చేస్తున్నారు. మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌ తీసుకుని, అందుకు నగదు ఇవ్వదు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మద్యం కొరత ఏర్పడింది. అయితే ఈ ప్రభావం పడకుండా.. ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే ప్రభుత్వ షాపులకు సరుకును చేర్చింది. ఒక్కో షాపునకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల విలువైన మద్యాన్ని చేర్చింది. షాపుల్లో సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తిచేసి, వారికి శిక్షణ ఇచ్చింది. 1వ తేదీ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని షాపులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 3,500 షాపుల్లో 3,200 వరకూ మంగళవారం ప్రారంభం కావొచ్చని, మిగిలినచోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ప్రైవేటు షాపుల తరహాలోనే ప్రభుత్వ షాపుల్లోనూ అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు.

బీర్ల అమ్మకాలపై అస్పష్టత
లిక్కర్‌ వరకూ అన్ని బ్రాండ్లూ ప్రభుత్వ దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నా.. బీర్ల విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ షాపుల్లో పర్మిట్‌ రూమ్‌లు ఉండవు కాబట్టి బీర్ల కూలింగ్‌కు షాపుల్లో ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయడం లేదని ఓ వైపు చెబుతూ, అవకాశం ఉన్నచోట ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేస్తామని మరో మాట చెబుతున్నారు. ఫ్రిడ్జ్‌ల కొనుగోలు తలకుమించిన ఆర్థిక భారం కావడం వల్లే వెనకడుగు వేస్తున్నట్టు ఎక్సైజ్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనివల్ల బీర్ల అమ్మకాలు పడిపోతే ఏంచేయాలనే దానిపై అధికారులు ఇంతవరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. షాపులో బీర్లు కొని ఇంటికి తీసుకెళ్లి కూలింగ్‌ పెట్టుకుని తాగేవారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటుందని, అప్పటికప్పుడు తాగేవారే ఎక్కువగా ఉంటారని, ప్రభుత్వ నిర్ణయం వల్ల బీర్ల అమ్మకాలు దారుణంగా పడిపోతాయని అధికార వర్గాలే చెబుతున్నాయి.

ఎక్సైజ్‌ సిబ్బందికే బాధ్యత
ప్రైవేటు షాపుల్లో ఉల్లంఘనలు జరిగితే వ్యాపారులపై కేసులు పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వ షాపుల్లో ఉల్లంఘనలకు షాపు సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ను బాధ్యులను చేయనున్నారు. అయితే తమపై తామే కేసులు పెట్టుకుంటే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఉల్లంఘనలకు అవకాశం లేకుండా సీఐలు, ఎస్‌ఐలకు పదేసి షాపుల బాధ్యతను అప్పగిస్తున్నారు. దీనివల్ల అవకతవకలు తగ్గుతాయని భావిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *