హైదరాబాద్ : దీపావళి సందర్భంగా టపాసుల అమ్మకానికి, బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్న వ్యాపారులు… ఈ నెల 21లోపు దరఖాస్తులు చేసుకోవాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. ప్రతి జోన్లో డీసీపీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు పొందవచ్చన్నారు. నింపిన ఫారములను ఈ నెల 21లోపు కార్యాలయాల్లో అందజేసి అనుమతి తీసుకోవాలన్నారు. 21 తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించబడవని పేర్కొన్నారు. విశాలమైన మైదాన స్థలం ఉన్న ప్రాంతాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలకు, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి తప్పనిసరి…
దరఖాస్తు ఫారముతో పాటు డివిజనల్ ఫైర్ అధికారితో ఎన్ఓసీ తప్పనిసరి.
ప్రభుత్వ స్థలంలో షాపులు ఏర్పాటు చేస్తే జీహెచ్ఎంసీ నుంచి అనుమతి ఉండాలి.
ప్రైవేటు స్థలాల్లో అయితే స్థల యజమానులతో అనుమతి పత్రం ఉండాలి.
గతేడాది లైసెన్సు జారీ అయి ఉంటే దాని కాపీ నకలు.
సింగిల్ షాపు ఉంటే స్థానికుల నుంచి ఎన్ఓసీ, షాపు బ్లూప్రింట్ కాపీ, లైసెన్సు ఫీజు చెల్లించిన రసీదు జతపరచాల్సి ఉంటుంది.