Breaking News
Home / National / రజనీకాంత్‌ కూడా విచారించాలి. అనా… సీమాన్‌…..

రజనీకాంత్‌ కూడా విచారించాలి. అనా… సీమాన్‌…..

చెన్నై(అమరావతి): ‘తూత్తుకుడి స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సంఘ విద్రోహులు చొరబడ్డారని రజనీకాంత్‌ ఏ ఆధారంతో చెప్పారు. ఆయనకెలా తెలుసు? ఈ విషయాలు బయటకురావాలంటే ఆయనను కూడా విచారించాలి’ అంటూ నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తూత్తుకుడి కాల్పుల ఘటన అనంతరం రజనీకాంత్‌ తన స్పందన తెలియజేస్తూ, ప్రజా పోరాటంలో సంఘ విద్రోహులు చొరబడ్డారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తూత్తుకుడి తుపాకీ కాల్పుల సంఘటనపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్‌ జడ్జి అరుణ జగదీశన్‌ సారథ్యంలోని ఏకసభ్య కమిటీ ముందు సీమాన్‌ బుధవారం ఉదయం హాజరయ్యారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 14 విడతలుగా జరిపిన విచారణలో దాదాపు 377 మందిని కమిటీ విచారించింది. ఆ క్రమంలో తూత్తుకుడిలో విచారణ కమిటీ కార్యాలయంలో బుధవారం 15వ విడత విచారణ ప్రారంభమైంది. ఆ సందర్భంగా నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ హాజరై, కమిటీ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.

అనంతరం సీమాన్‌ విలేకరులతో మాట్లాడుతూ, తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సంబంధించి నామ్‌ తమిళర్‌ కట్చి కార్యకర్తలపైనే అధికంగా కేసులు నమోదు చేశారని, అందువల్లే తనను విచారణకు పిలిచినట్టు చెప్పారు. తుపాకి కాల్పులు జరిగిన ఘటనకు ముందు ఆందోళన కారుల్లో సంఘ విద్రోహులు చొరబడినట్టు రజనీ కాంత్‌ చెప్పారని, ఆయన్ని కూడా విచారణకు పిలవాలని కమిటీకి చెప్పినట్టు తెలిపారు. పోరాటంలో సంఘ విద్రోహులు చొరబడినట్టు రజనీకాంత్‌ ఎలా తెలుసు? పోరాటంలో పాల్గొన్న ప్రజల్ని చూసి కూడా ఏదో తెలిసినట్లు సంఘ విద్రోహులు చొరబడ్డారని ఎలా చెబుతారు? ఆయన నిఘా ఏదైనా పెట్టారా?

ఒకవేళ రజనీ చెప్పింది నిజమే అయితే.. ఆ సంఘ విద్రోహులు ఎవరో చూపించాలి అని సీమాన్‌ డిమాండ్‌ చేశారు. పోరాటంలో పాల్గొన్న ప్రజలు సంఘ విద్రోహులైతే, కాలుష్యకారక కర్మాకారానికి అనుమతి ఇచ్చి, పోరాడడానికి కారణమైనవారు కూడా సంఘ విద్రోహులేనని వ్యాఖ్యానించారు. ప్రజలు వినతి పత్రం ఇచ్చేందుకే వచ్చారని, అయితే ఘర్షణ జరుగుతుందని ప్రభుత్వానికి ఎలా తెలిసిందని, ఎవరూ రాళ్లు కూడ విసరలేదని, అయినా సరే పథకం ప్రకారమే తుపాకీ కాలుపలు జరిపారని ఆరోపించారు. స్టెరిలైట్‌ కర్మాగారాన్ని ఎప్పటికీ తెరువనివ్వమని ప్రభుత్వం పదేపదే ప్రకటిం చిందని, అదే కోరికతోనే ప్రజలు కూడా పోరాటం చేస్తున్నప్పుడు వారిపై దాడి చేయడం, తుపాకులతో కాల్పులు జరపాల్సిన అవసరం ఏమిటని సీమాన్‌ ప్రశ్నించారు. ఇక విదేశాల నుండి తనకు ఆర్థిక సహాయం అందుతోందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ అది నిజమే అయితే అది నిర్ధారించే బాధ్యత ఆదాయపు పన్నుశాఖదేనని సీమాన్‌ ఆవేశంగా అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *