ఆన్లైన్లో ప్రజలే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు
దస్తావేజులేఖర్లకు చెక్
ఇప్పటికే జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
నవంబరు 1నుంచి పూర్తి స్థాయిలో
ఇళ్లు, భూమి కొనుగోలు, విక్రయాలు చేయాలంటే రిజిస్ర్టేషన్ తప్పనిసరి. కుటుంబ సభ్యులకు గృహం బహుమతిగా ఇవ్వాలన్నా చట్ట ప్రకారం రిజిస్ర్టారు కార్యాలయానికి వెళ్లాల్సిందే. భూమి, గృహాలు కొనుగోలు చేసే సమయంలో దస్తావేజు రాయాలంటే దస్తావేజులేఖరుల వద్దకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా కాకుండా కార్యాలయ అధికారులు, సిబ్బంది వద్దకు వెళితే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించిన సంఘటనలు కోకొల్లలు. ఇక నుంచి ఈ తిప్పలు ప్రజలకు తప్పుతాయి. ఇంటి నుంచే రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. అదేమిటో తెలుసుకుందాం..
మచిలీపట్నం : దస్తావేజులేఖరుల ప్రమేయం లేకుండా ప్రజలే స్వయంగా ఆన్లైన్లో వివరాలు పంపి మన కిష్టం వచ్చిన రోజున రిజిస్ర్టేషన్ చేసుకునే వెసులుబాటు నవంబరు ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే జిల్లాతో పాటు విశాఖలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చే స్తున్నారు.
ఇంటి వద్ద నుంచే
భూమి కొనుగోలు చేసే వారు రిజిస్ర్టారు కార్యాలయానికి వెళ్లకుండా ఇంటివద్ద నుంచే ఆన్లైన్లో క్రయ విక్రయదారుల వివరాలు, భూమి సర్వేనెంబర్లు, ఆధార్ కార్డు నెంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఉంది. ఏ భాషలో నైనా దస్తావేజు రూపొందించుకునే అవకాశం కల్పించారు.
ఎలా తయారు చేయాలంటే ..
నూతన రిజిస్ర్టేషన్ విధానంలో రిజిస్ర్టేషన్, స్టాంపుల శాఖ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. రిజిస్ర్టేషన్.ఏపీ.జీవోవీ.ఇన్‌లోకి వెళ్లాలి. అందులో పబ్లిక్ డేటా ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడే కింద ఉన్న న్యూ యూజర్‌ను క్లిక్ చేస్తే ఒక పేజీ వస్తుంది. అందులో మన పేరు, ఫోన్ నెంబరు ఆధార్ కార్డు నెంబరు, ఈమెయిల్ ఐడీ, చిరునామా, యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేయాలి. సబ్మిట్ కొడితే మనమిచ్చిన సెల్‌ఫోన్ నెంబరుకు ఓటీపీ నెంబరు వస్తుంది. ఈ నెంబరును సబ్మిట్ చేస్తే సంబంధిత వ్యక్తి పేరు నమోదవుతుంది. హోం పేజీలోకి వెళ్లి పబ్లిక్ డేటా ఎంట్రీపై క్లిక్ చేస్తే అందులో మన పేరు, యూజర్ ఐడీ నెంబరు, పాస్వర్డ్ నమోదు చేస్తే పేజీ తెరుచుకుంటుంది. అందులో కొన్ని ఆప్షన్లు చూపుతుంది. న్యూ డాక్యుమెంటేషన్‌పై క్లిక్ చేస్తే ఆస్తి వివరాలు నమోదు చేసే పేజీ వస్తుంది. ఇందులో విక్రయదారులు, కొనుగోలుదారుల పేర్లు, అడ్రసు, ఆధార్ కార్డు నెంబర్లు, ఆస్తి వివరాలు, సర్వే నెంబర్లు, హద్దులు, లింక్ డాక్యుమెంట్లు, సాక్షుల వివరాలు, నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఆస్తి వివరాలు నమోదు చేయగానే ఎంతమేర స్టాంప్ డ్యూటీ చెల్లించాలో చూపుతుంది. ఆన్లైన్ ద్వారా సంబంధిత నగదును చెల్లించాలి. దస్తావేజు నమూనాలో వివరాలన్నీ పొందుపరిస్తే జనరేట్ అని వస్తుంది. ఈ వివరాలను ప్రింట్ తీయించుకోవాలి. టైమ్ స్లాట్‌ను నమోదు చేసుకుని సంబంధిత సమాయానికి క్రయ విక్రయదారులు రిజిస్ర్టారు కార్యాలయానికి వెళితే రిజిస్ర్టేషన్ ఇట్టే అయిపోతుంది.
ఉపయోగాలు
సులభతరమైన , కచ్చితమైన ఆన్లైన్ చెల్లింపులు, పారదర్శకమైన మార్కెట్ విలువల లెక్కింపు, నమోదైన సమాచారాన్ని ఈసీలో పొందుపరచడం, కార్యాలయంలో డేటా ఎంట్రీలో జరిగే పొరపాట్లను నివారించే అవకాశం ఏర్పడుతుంది. వేగవంతగా రిజిస్ర్టేషన్లు జరుగుతాయి.
ఇప్పటికే ఆన్లైన్ ద్వారా మూడు రిజిస్ర్టేషన్లు
జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఆన్లైన్ రిజిస్ర్టేషన్ విధానంలో ఇప్పటివరకు క్రయ విక్రయదారులే స్వయంగా దస్తావేజులు సమర్పించగా మూడు రిజిస్ర్టేషన్లు జరిగినట్టు మచిలీపట్నం రిజిస్ర్టారు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం జిల్లా రిజిస్ర్టారు కార్యాలయ పరిధిలో 13 సబ్ రిజిస్ర్టారు కార్యాలయాలున్నాయి. విజయవాడ ఈస్ట్ కార్యాలయ పరిధిలో ఐదు, విజయవాడ రిజిస్ర్టారు కార్యాలయ పరిధిలో ఏడు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలున్నాయి. ప్రయోగాత్మకంగా క్రయ, విక్రయదారులు నేరుగా దస్తావేజులు ఆన్లైన్లో సమర్పించే క్రమంలో చిన్న చిన్న సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తున్నాయని వాటిని నెలాఖరుకు సరిదిద్దుతామని మచిలీపట్నం రిజిస్ర్టారు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ల రిజిస్ర్టేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు.