న్యూఢిల్లీ: మొబైల్ ఆపరేటర్లు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు స్పెక్ట్రమ్ బకాయిలు రూ.94 కోట్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డీవోటీ)కి గత నెలలో చెల్లించినట్టు తెలుస్తోంది. వొడాఫోన్ ఐడియా రూ.54.52 కోట్లు, రిలయన్స్ జియో రూ.39.1 కోట్లను చెల్లించినట్టు ఈ అంశంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు. బకాయిల చెల్లింపులపై రిలయన్స్ జియో నోరు విప్పకపోగా, ఈ విషయంపై మాట్లాడబోమని వొడాఫోన్ ఐడియా అధికార ప్రతినిధి తెలిపారు.
అప్పుల్లో కూరుకుపోయిన టెలికం సంస్థలకు ఊరటనిచ్చేలా గతేడాది మార్చిలో ప్రభుత్వం స్పెక్ట్రమ్ చెల్లింపుల ఇన్స్టాల్మెంట్లను 10 నుంచి 16 ఏళ్లకు పెంచింది. కాగా, సంక్షోభంలో ఉన్న టెలికం ఇండస్ట్రీకి తక్షణ ఉపశమన చర్యలు అవసరమని టెలికం సంస్థలు కోరుతున్నాయి. ఇందులో భాగంగా లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జ్లు, జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తదితర వాటిని తగ్గించాలని ఇండస్ట్రీ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.