Breaking News
Home / Lifestyle / Business / ‘నిర్మ’ యాడ్ గుర్తుందా.. ఈ యాడ్ వెనుక ఏం జరిగిందో చూడండి!

‘నిర్మ’ యాడ్ గుర్తుందా.. ఈ యాడ్ వెనుక ఏం జరిగిందో చూడండి!

టీవీ చూస్తున్న ప్రతీసారి ఏదో ఒక ప్రకటన కంట పడుతూనే ఉంటుంది. కానీ.. కొన్ని యాడ్స్ మాత్రమే జనం దృష్టిని ఆకర్షిస్తాయి. అలా ఆకర్షించిన ప్రతీ యాడ్‌కు సంబంధించిన ఉత్పత్తులను కొంటారని కచ్చితంగా చెప్పలేం. అయితే.. 1990వ సంవత్సరంలో టీవీలో ప్రదర్శితమైన ఓ యాడ్ పెద్ద సంచలనమే సృష్టించింది. మధ్యతరగతి ప్రజలు ఆ యాడ్ చూసి ఎగబడి కొనేలా చేసింది. ఆ యాడ్ మరేదో కాదు వాషింగ్ పౌడర్ నిర్మ యాడ్. ఈ యాడ్ అప్పట్లో జనంలోకి ఏ రేంజ్‌లో వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ తెల్ల ఫ్రాక్ వేసుకున్న పాప గుండ్రంగా తిరుగుతూ కనిపించే నిర్మ యాడ్ అప్పట్లో హల్‌చల్ చేసింది. నిర్మ డిటర్జెంట్ పౌడర్ పేరుతో కనిపించిన ఆ యాడ్‌ వెనుక చాలా పెద్ద కథే ఉంది.

1969వ సంవత్సరం సమయంలో సర్ఫ్ అనే డిటర్జెంట్ పౌడర్ మార్కెట్‌ను శాసించేది. డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ఫ్ అనే విధంగా ప్రాచుర్యం పొందింది. అయితే.. ప్యాకెట్ ధర 10 నుంచి 15రూపాయలు ఉండేది. అప్పట్లో అంత పెట్టి కొనడమంటే మధ్యతరగతి ప్రజలకు కష్టతరమైన వ్యవహారమనే చెప్పాలి. ధర కాస్త ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు సర్ఫ్ కొనాలంటే జంకే పరిస్థితి ఉండేది. అదే సమయంలోనే.. గుజరాత్ ప్రభుత్వ మైనింగ్ అండ్ జువాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న కెమిస్ట్ కర్సన్‌భాయ్ పటేల్‌కు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. తనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు డిటర్జెంట్ పౌడర్‌ను అందించాలనుకున్నాడు.

అహ్మదాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ఓ డిటర్జెంట్ ఫార్ములాను కనిపెట్టాడు. పసుపు రంగులో ఉండే ఓ డిటర్జెంట్ పౌడర్‌ను తయారుచేశాడు. ఒక్కో ప్యాకెట్‌ను 3రూపాయలకు అమ్మడం మొదలుపెట్టాడు. కేవలం ప్యాకెట్స్ అమ్మితే లాభం లేదనుకుని తన డిటర్జెంట్ పౌడర్‌కు ‘నిర్మ’ అని పేరు పెట్టాడు. ప్రమాదంలో చనిపోయిన పటేల్ కుమార్తె నిరుపమ పేరు మీదుగా ‘నిర్మ’ అని తన డిటర్జెంట్ పౌడర్‌కు పేరు పెట్టాడు. ఇంటింటికీ వెళ్లి ‘నిర్మ’ డిటర్జెంట్ పౌడర్‌ను అమ్మాడు. అంతేకాదు, ప్రతీ ప్యాకెట్ పైన కచ్చితంగా క్యాష్‌బ్యాక్ ఇస్తాననడంతో మధ్యతరగతి ప్రజలు బాగానే కొన్నారు. అహ్మదాబాద్‌లో ‘నిర్మ’ డిటర్జెంట్ పౌడర్ ప్రాచుర్యం పొందింది. దీంతో పటేల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తన వ్యాపార పరిధిని పెంచుకోవాలనుకున్నాడు. కానీ.. సరిపడినంత డబ్బు లేదు. అప్పట్లో వ్యాపారానికి కావాల్సిన మూలధనం కోసం అప్పు చేయాలంటే నియమాలు పక్కాగా ఉండేవి. ఆ నియమాల ప్రకారం నడుచుకుని అప్పు తీసుకున్న పటేల్ నష్టాలను చవిచూశాడు. దీంతో ఇక ‘రిస్క్’ చేయకూడదని ఫిక్స్ అయిన పటేల్‌కు ఓ మహత్తరమైన ఐడియా వచ్చింది. అదే నిర్మ యాడ్. తక్కువ ఖర్చుతో తన బ్రాండ్‌కు ఆదరణ దొరకాలంటే టెలివిజన్‌లో ప్రకటన ఒక్కటే మార్గమని ఆయన భావించాడు. ఆ ఆలోచన నుంచే ‘నిర్మ’ యాడ్ పుట్టింది. ఈ యాడ్ బీభత్సంగా హిట్ అయింది.

ధర తక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు నిర్మ డిటర్జెంట్ పౌడర్‌ను ఎగబడి కొన్నారు. ఆ తర్వాత పటేల్ వెనుతిరిగి చూసుకోలేదు. 1990లో పూర్తి స్థాయిలో ‘నిర్మ’ డిటర్జెంట్ పౌడర్ అందుబాటులోకి వచ్చింది. అదే ఊపులో.. నిర్మ పేరుతో టాయ్‌లెట్ సోప్స్, బ్యూటీ సోప్స్, షాంపులు, టూత్‌పేస్ట్‌లు మార్కెట్‌లోకి విడుదల చేశారు. వాటిల్లో కొన్ని లాభాలను, మరికొన్ని నష్టాలను మిగిల్చాయి. ఏదేమైనా ఈరోజుకు కూడా ‘నిర్మ’ సబ్బులు 20శాతం, డిటర్జెంట్ పౌడర్ 35శాతం మార్కెట్‌ను కలిగి ఉండటం విశేషం. 1995లో అహ్మదాబాద్‌లో నిర్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, 2003లో మేనేజ్‌మెంట్ అండ్ ది నిర్మ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని పటేల్ స్థాపించారు. 2010లో ఆయనను పద్మశ్రీ కూడా వరించింది. 2009 నుంచి 2017 మధ్య కాలంలో ఫోర్బ్స్ విడుదల చేసిన భారతీయ ధనవంతుల్లో పటేల్ ఒకరు.

Check Also

పసిడికి కళ

Share this on WhatsAppమళ్లీ మదుపర్లను ఆకర్షిస్తున్న బంగారం అంతర్జాతీయ పరిణామాలే కారణం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *