లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 25 వేల హోంగార్డులను ఉద్యోగాల నుంచి తొలగించింది. దీపావళికి కొద్ది రోజుల ముందుగా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ ప్రభుత్వ పోలీసుశాఖ జారీ చేసిన ఆదేశాల్లోని వివరాల ప్రకారం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంగార్డుల తొలగింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ బీపీ జోగదండ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గల కారణాలు తనకు ఇంకా తెలియలేదన్నారు. కాగా హోంగార్డుల తొలగింపుపై యూపీ కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ స్పందిస్తూ సీఎం యోగి వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు.
