గుంటూరు : ఆటో అదుపుతప్పి బోల్తాపడి 10 మంది విద్యార్థులు గాయపడగా, మరొక విద్యార్థిని తీవ్రగాయాలపాలైన ఘటన పిడుగురాళ్ళ సమీపంలో చోటు చేసుకుంది. పిడుగురాళ్లలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులు, గుత్తికొండలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ సెలక్షన్స్ కు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆటోలో ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యంలో పిడుగురాళ్ల సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులలో, పదిమందికి స్వల్ప గాయాలు కాగా, పిడుగురాళ్ల ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని వర్ష తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. విద్యార్థినికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
