హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అమలాపురం బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన అంబాజీపేట మండలం పెదపూడి వద్ద జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి, కాలువలోకి దూసుకెళ్లడంతో బస్సులోని పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ వాటిల్లక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే ట్రావెల్స్ సిబ్బంది, బస్సు నెంబర్ ప్లేట్లపై మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారని ప్రయాణికులు అరోపించారు.
