హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతమైన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యవర్తిత్వం నెరపడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె మొదలై 16 రోజులు అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆర్టీసీ జేఏసీ ఆగ్రహంతో ఉంది. సోమవారం నుంచి సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తోంది. ప్రతి ఒక్కరి చేతికి గులాబీలు ఇచ్చి ఆర్టీసీ ఎందుకు అవసరమో వివరించబోతోంది. ఆదివారం సుందరయ్య భవన్లో రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈనెల 23న ఓయూలో నిర్వహించదలచిన సభపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నిరసనల్లో భాగంగా కార్మికులు ప్రజల్లోకి వెళ్లి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ప్రజలకు గులాబీ పూలు పంచుతున్నారు.
