Breaking News
Home / National / ఉద్రిక్తంగా శబరిగిరులు.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు!

ఉద్రిక్తంగా శబరిగిరులు.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు!

తిరువనంతపురం: శబరిగిరులు ఉద్రిక్తంగా మారాయి. మహిళలను అడ్డుకోవడానికి వస్తున్న ఆందోళనకారులు.. వారిని తరిమి కొడుతున్న పోలీసులతో అక్కడ పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఆందోళనకారులన్న అనుమానం కలిగితే.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు సంఘ్‌పరివార్ నేత అరెస్ట్‌కు నిరసనగా కేరళ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటలకు హిందూ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కేపీ శశికళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్‌కు నిరసనగా శబరిమల కర్మ సమితి సహా పలు సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు కారణంగా చాలా చోట్ల దుకాణాలు మూతపడ్డాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, శబరిమలకు వెళ్లే బస్సులను తాము అడ్డుకోబోమని నిరసనకారులు ప్రకటించారు.

మరోవైపు భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. వార్షిక మండల దీక్ష కోసం నిన్నటి నుంచి ఆలయ ద్వారాలు తెరిచారు. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల నుంచే వేలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. అయితే ఆలయం వద్ద పోలీసులు భద్రత చాలా ఎక్కువగా ఉందని, తమను పూజలు కూడా సరిగా చేసుకోనీయడం లేదని అయ్యప్ప భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌కు ముంబైలోనూ నిరసన సెగ తగిలింది. ఆందోళనకారుల కారణంగా తృప్తి, ఆమెతో ఉన్న మహిళలు ముంబై విమానాశ్రయం వెలుపలకు రాలేకపోయారు. దీంతో సీఐఎస్ఎఫ్ జవాన్లు, ముంబై పోలీసుల భద్రతతో ఆమె అక్కడి నుంచి బయటకు వెళ్లారు. నిన్న కేరళకు చేరుకున్న సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ను ఆందోళనకారులు కొచ్చి ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. దాదాపు 14 గంటలు విమానాశ్రయంలోనే ఉండిపోయిన ఆమె.. చేసేదేమీ లేక ముంబైకి తిరిగి వెళ్లిపోయారు. కాగా, ఆమెను అడ్డుకున్న దాదాపు 500 మంది ఆందోళనకారులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏదిఏమైనా అయ్యప్పను దర్శించుకొని తీరుతామని పలువురు మహిళలు పట్టుదలతో ఉన్నారు. కార్తీకమాసం కావడంతో మండలం పూజ కోసం శబరిమల ఆలయం 41 రోజుల పాటు తెరిచి ఉంటుంది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత శబరిమల ఆలయాన్ని మూడుసార్లు తెరిచారు. కానీ ప్రతిసారి అయ్యప్ప సన్నిదానం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈసారి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. దాంతో వేలాది మంది పోలీసులు శబరిగిరి పరిసరాల్లో మోహరించారు.

ఇదిలాఉంటే.. శబరిమల వివాదంపై బంగ్లాదేశ్ వివాదాస్ప రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. మహిళా కార్యకర్తలంతా శబరిమలను దర్శించడానికి ఎందుకింత అత్యుత్సాహం చూపిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. శబరిమల బదులు.. గ్రామాల్లోకి వెళ్లి అక్కడ మహిళల పట్ల జరుగుతున్న గృహహింస, అత్యాచారం, వేధింపులు తదితర సమస్యలపై పోరాడితే మంచిది అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Check Also

సభలో కలతచెందిన సోనియాగాంధీ

Share this on WhatsAppన్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై దేశాన్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *