వివాదాస్పద అయోధ్య కేసులో వాదనలు బుధవారంతో ముగిశాయి. సుప్రీం కోర్టులో 40 రోజుల పాటు వాదనలు కొనసాగాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో తీర్పును సుప్రీం రిజర్వ్‌లో ఉంచింది. కేసుకు సంబంధించిన రాతపూర్వక దస్త్రాలను మరో మూడు రోజుల్లో సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5 గంటల డెడ్‌లైన్ ఉన్నా.. ఓ గంట ముందే సుప్రీం ఈ కేసులో వాదనలు ముగించింది. వివాదాస్పద స్థలం గురించి అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించాయి. వక్ఫ్ బోర్డు, హిందూ మహాసభ, నిర్మోహి అఖాడాలు తమ అభిప్రాయాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఉంచాయి. జస్టిస్ ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ఏ నజీర్ బెంచ్ 40 రోజుల పాటు వాదనలు విన్నది. సుదీర్ఘ విచారణ అక్టోబర్ 14న కీలకమైన తుది దశకు చేరుకుంది. వారం రోజుల దసరా సెలవుల తరువాత 38వ రోజు సుప్రీం తిరిగి విచారణ ప్రారంభించి 40వ రోజు అయిన బుధవారంతో పూర్తి చేసుకుంది. ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణను సుప్రీం కోర్టు రికార్డు చేస్తూ వచ్చింది. నవంబర్ 17న జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్నారు. దీనికంటే ముందే తీర్పు వెల్లడించడానికి సుప్రీం కోర్టు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సుప్రీం కోర్టులో హైడ్రామా
రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు చివరి విచారణ రోజైన బుధవారం సుప్రీం కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ సుప్రీం కోర్టులో హల్చల్ చేశారు. సీజే రంజన్ గొగొయ్ ధర్మాసనానికి ఆగ్రహం తెప్పించారు.
వికాస్ సింగ్ : ‘ అయోధ్య రీవిజిటెడ్’ పేరుతో ఐపీఎస్ మాజీ అధికారి కిశోర్ కునాల్ ఓ పుస్తకం రాశారు. ఇందులో అయోధ్యలో రాముడికి సంబంధించిన కీలక విషయాలు ఉన్నాయి. సాక్ష్యం కింద దాన్ని ధర్మాసనం ముందు ఉంచేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
రంజన్ గొగొయ్ : తప్పకుండా ప్రవేశపెట్టండి. ఎలాంటి అభ్యంతరం లేదు.
రాజీవ్ ధావన్ : సుప్రీం కోర్టుకు సీరియస్‌గా చెబుతున్నాను.. కోర్టు ఇలాంటి పుస్తకంపై ఆధారపడకూడదు. 1986లో ముద్రించిన ఈ పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దు.
రంజన్ గొగొయ్ : మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి.
(వికాస్ సింగ్ తన వాదనలు వినిపిస్తున్నారు)
రాజీవ్ ధావన్ : ఆ పుస్తకాన్ని ధర్మాసనం ముందు ఉంచితే చింపేస్తాను. (అంటూనే.. పుస్తకంలోని కొన్ని పేజీలు, మ్యాపును సీజే రంజన్ గొగొయ్ ముందు చింపేశాడు)
(దీంతో రంజన్ గొగొయ్‌తో పాటు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..)
రంజన్ గొగొయ్ : ఈ పద్ధతి సరికాదు. ఇలాగైతే విచారణను మధ్యలోనే నిలిపివేస్తాం. వాదనలు ఇలాగే కొనసాగిస్తే ఇప్పుడే వెళ్లిపోతాం. సహకరించాల్సింది పోయి గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తారా..?
ఎస్ఏ నజీర్ (న్యాయమూర్తి) : మిస్టర్ ధావన్.. మీరు పుస్తకం చించిపారేయడం వైరల్ అయ్యింది.
రాజీవ్ ధావన్ : నేను పుస్తకం చించడం వైరల్ అయ్యింది నిజమే. దీనికి కారణం చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయే. ఆయన చెబితేనే నేను పుస్తకం చించేశాను.
పీఎన్ మిశ్రా (హిందీ పిటిషనర్ న్యాయవాది) : ధావన్ పుస్తకం చించడం సరికాదు. మూర్ఖంగా వ్యవహరించారు.
రాజీవ్ ధావన్ : మిస్టర్ మిశ్రా గారూ.. మీరు చేస్తున్నవ్యాఖ్యలే మూర్ఖంగా ఉన్నాయి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. మీకేం తెలీదు. ఇది వ్యక్తిగతమైన విషయం కాదు.
పీఎన్ మిశ్రా : నేను పీహెచ్డీ చేశాను. భూమిపై నేను కూడా పుస్తకం రాశాను. నేను మూర్ఖున్ని కాదు.
రాజీవ్ ధావన్ : అయితే మీకు నేను సెల్యూట్ చేస్తున్నాను. మీరు మేధావులు. అయినా మీకు చరిత్ర గురించి తెలీదు. ప్లీజ్ కూర్చోండి.
రంజన్ గొగొయ్ : పుస్తకంలోని విషయాలపై సదరు న్యాయవాది స్పష్టం చేయని పక్షంలో చించేయాల్సిందిగా రాజీవ్ ధావన్‌కు సూచించాను. కానీ వికాస్ సింగ్ చదవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే రాజీవ్ ధావన్ దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. చింపేయడానికి ప్రయత్నించారు. చివరికి కొన్ని పేజీలు చించేశారు కూడా.
రాజీవ్ ధావన్ : దయచేసి విచారణ గడువును పొడగించండి.
రంజన్ గొగొయ్ : ఇక చాలు. ఒక్క రోజు కూడా పొడగింపు ఉండదు. బుధవారంతో 40 రోజుల గడువు ముగిసింది. ఒక్క రోజు అయోధ్య కేసు సుప్రీం కోర్టులో వినిపించినా.. అది తీర్పు రోజే. ఏమైనా చెప్పాలనుకుంటే రాత పూర్వకంగా మూడు రోజుల్లో తెలియజేయాలి.
గొగొయ్ చెబితేను చించేశాను : రాజీవ్ ధావన్
మధ్యాహ్నం వరకు కొనసాగిన వాదనలు మళ్లి భోజనం విరామ అనంతరం ప్రారంభం అయ్యాయి. ఈ మధ్యలో రాజీవ్ ధావన్ మీడియాతో మాట్లాడారు. సీజే రంజన్ గొగొయ్ చెబితేనే పుస్తకం చించేశానంటూ తప్పంతా ఆయనపై నెట్టేశాడు. “అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని సమర్పిస్తానని వికాస్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. నేను అంగీకరించలేదు. రంజన్ గొగొయ్ కల్పించుకున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కునాల్ కిశోర్ రాసిన పుస్తకంలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని వివరించాను. అలా ఉంటే మీరు చిప్పేయండి అని రంజన్ గొగొయ్ చెప్పారు. అందుకే ఆ పుస్తకాన్ని చింపేశాను” అని రాజీవ్ ధావన్ చెప్పడం గమనార్హం.
బాబర్ అయోధ్యకు రాలేదు : సుశీల్ కుమార్ జైన్
నేను నిర్మోహి అఖాడా తరఫున కేసును వాదిస్తున్నాను. బాబర్ అయోధ్యకు వచ్చారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వారు చూపించిన పత్రాలు ఓ రెవెన్యూ గ్రాంట్‌కు సంబంధించినవి. అవి బాబ్రీ మసీదుకు సంబంధించినవి కావు. మనల్ని కలిపి ఉంచేది విశ్వాసం, నమ్మకాలే. బాబర్ ఏం చేశారనేదానితో సంబంధం లేదు. అక్కడున్నది మందిరమే. దాన్ని బాబర్ కూలగొట్టలేదు. గతంలోనూ, ఇప్పుడు కూడా అది మందిరమే. మందిరాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారనే వాదన అనవసరంగా సృష్టించారు. దీన్ని పొందాలంటే ముస్లింలు కూడా అసలు వారికి ఆ ప్రదేశం ఎలా వచ్చిందో నిరూపించుకోవాలి. మందిరాన్ని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ నిర్వహించారు.
హిందువులే పూజలు చేశారు : వైద్యనాథన్
నేను హిందువుల తరఫున సీనియర్ న్యాయవాదిగా విచారణలో పాల్గొన్నాను. వివాదాస్పద ప్రాంతంలో 1857 నుంచి 1934 వరకు ప్రతీ శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేవారు. అయితే ఆ తరువాత వారు ప్రార్థనలు చేశారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇక్కడ హిందువులు మాత్రం తమ పూజలు కొనసాగిస్తున్నారు. వివాదాస్పద ప్రాంతంపై ముస్లింలకు హక్కులేదు. రామ జన్మ భూమికి పరిగణించే స్థలంలో హిందువులు పూజించేందుకు స్థలం లేదు.
సుదీర్ఘ విచారణలో రెండో కేసు
అయోధ్య కేసును రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు విచారించింది. దీంతో సుప్రీం చరిత్రలో అతిసుదీర్ఘ వాదనలు జరిగిన రెండో కేసుగా రికార్డులో నిలిచింది. 1972లో కేశవానంద భారతి కేసులో సుప్రీం ధర్మాసనం అత్యధికంగా 68 రోజుల పాటు విచారించింది. 13 మందితో కూడిన ధర్మాసనం కేసు విచారించింది. ఇక ఆధార్ కేసు అత్యున్నత న్యాయ స్థానం 38 రోజుల పాటు విచారించింది. అయోధ్య కేసులో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మొత్తం 14 కేసులు దాఖలయ్యాయి. అయోధ్యలో వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని మూడు భాగాలుగా పంచాలని గతంలో తీర్పునిచ్చారు. సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు ఇవ్వాలని సూచించారు. నవంబర్ 17వ తేదీలోపు విడుదలయ్యే ఈ తీర్పులో సీనియర్ న్యాయవాదులు కే.పరశరన్, సీఎస్ వైద్యనాథ్లు రామ్‌లల్లా తరఫున వాదించారు. న్యాయవాది ఎస్కే జైన్ నిర్మోహి అఖాడా తరఫున వాదించగా.. రాజీవ్ ధావన్, మీనాక్షి అరోరా, శేఖర్ నపడేలు సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించారు.
ఆగస్టు 6 నుంచి విచారణ
ఆగస్టు 6 నుంచి రోజువారీగా అయోధ్య కేసులో వాదనలు సాగాయి. వాస్తవానికి అయోధ్య కేసును పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తి ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఎఫ్ఎం ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచూలు మధ్యవర్తులుగా ఉన్నారు. కానీ వారి మధ్యవర్తిత్వం విఫలమైంది. వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల స్థలం అంతా రాముడి జన్మస్థలమే అని హిందూ పార్టీలు వాదించాయి. కానీ ముస్లిం బోర్డు దీన్ని వ్యతిరేకించింది.
డిసెంబర్ 6 నుంచి ఆలయ నిర్మాణం : సాక్షి మహరాజ్
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. 1992, డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేయడం జరిగింది. మసీదు కూల్చివేసిన రోజు నుంచే రాముడి ఆలయం నిర్మాణ పనులు ప్రారంభం కావడం విశేషం. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమైంది. రామ మందిర నిర్మాణానికి హిందువులు, ముస్లింలు కలిసి రావాలి. బాబర్ వారి పూర్వీకుడు కాదు. ఓ ఆక్రమణదారుడు. ఈ విషయాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు అంగీకరించాలి. మరో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ.. తన పిటిషన్ తరువాతే అయోధ్య కేసులో సుప్రీం కోర్టు విచారణను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కల అని, దాన్ని సాకారం చేస్తుందని, ఈ దీపావళి కాకుండా మొత్తం ఏడాది పాటు పండుగ చేసుకుంటుందని చెప్పుకొచ్చారు.
