213 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 500 పాయింట్ల లాభం
ముంబై: బడ్జెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. మార్కెట్ ఇంట్రాడేలో భారీగా పెరిగిన తర్వాత నష్టాల్లోకి జారుకున్నా చివరకు పుంజుకుంది. మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన తాయిలాలు ఇందుకు బాగా దోహదం చేశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్ల లాభంతో 36,778.14 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకింది. ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడితో 36,221.32 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని చేరినా, వెంటనే కోలుకుని 212.74 పాయింట్ల లాభంతో 36,469.43 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా 62.70 పాయింట్ల లాభంతో 10,893.25 పాయింట్ల వద్ద ముగిసింది. రైతు లు, మధ్యతరగతి వర్గాలు ముఖ్యంగా వేతన జీవుల కోసం ఆర్థిక మంత్రి ప్రకటించిన తాయిలాలు శుక్రవారం మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. ఈ తా యిలాలతో జీడీపీలో ద్రవ్య లోటు 3.4 శాతానికి పెరిగే అవకాశం ఉన్నా మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదు. బీఎ్‌సఈ సెక్టోరియల్ ఇండెక్స్‌ల్లో ఆటో, కన్జుమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ ఇండెక్స్‌లు 2.63 శాతం వరకు లాభాలు నమోదు చేశాయి.
మెటల్, మైనింగ్, బ్యాంకింగ్ ఇండెక్స్‌లు మాత్రం అమ్మకాల ఒత్తిడితో నీరసించాయి. సెన్సెక్స్ షేర్లలో హీరో మోటోకార్ప్, మారతీ, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎ్‌ఫసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు 7.48 శాతం వరకు లాభాలతో ముగిశాయి. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సెన్సెక్స్ షేర్లలో వేదాంత షేరు అత్యధికంగా 17.82 శాతం నష్టపోయింది. బ్యాంకింగ్ షేర్లలో యెస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల షేర్లు 4.68 శాతం వరకు నష్ట పోయాయి.
పరిగెత్తిన జెట్ ఎయిర్వేస్ షేరు
జెట్ ఎయిర్వేస్ షేర్లు శుక్రవారం హాట్‌హాట్‌గా ట్రేడయ్యాయి. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఈ కంపెనీని గట్కెక్కించేందుకు ఇథిహాద్ ఎయిర్‌లైన్స్ సమర్పించిన ప్రణాళికకు ఆమోదం లభించిందన్న వార్తలు ఇందుకు దోహదం చేశాయి. దీంతో ఒక దశలో 19 శాతం వరకు దూసుకుపోయిన ఈ షేరు బీఎ్‌సఈలో చివరికి 7.79 శాతం లాభంతో రూ.255.90 వద్ద ముగిసింది.
డీహెచ్ఎఫ్ఎల్లో కొనసాగిన నష్టాలు
డీహెచ్‌ఎ్‌ఫఎల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి శుక్రవారం కొనసాగింది. దీంతో బీఎ్‌సఈలో ఈ కంపెనీ షేరు మరో 17.96 శాతం నష్టంతో రూ.111.45 వద్ద ముగిసింది.
ఏడాది గరిష్ఠ స్థాయిలో డాక్టర్ రెడ్డీస్ షేరు
మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండడంతో డాక్టర్ రెడ్డీస్ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. శుక్రవారం ఒక దశలో రూ.2,810కి చేరిన ఈ షేరు చివరికి 2.32 శాతం లాభంతో రూ.2,786.90 వద్ద ముగిసింది.