నిఫ్టీకి 10722-10644 వద్ద సపోర్ట్స్
యూరోపియన్, యూఎస్ మార్కెట్లు డౌన్
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ
నేడు (8న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యే వీలుంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 10,804 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,756 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సరికొత్త గరిష్టాలను తాకుతున్న యూఎస్ మార్కెట్లలో ట్రేడర్లు మంగళవారం లాభాల స్వీకరణకు తెర తీశారు. దీనికితోడు కోవిడ్-19 కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో యూరోప్, యూఎస్ మార్కెట్లు 1.5-1 శాతం మధ్య క్షీణించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి ఆటుపోట్లను చవిచచూడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు వరుసగా ఐదు రోజులపాటు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే వీలున్నట్లు భావిస్తున్నారు.