న్యూఢిల్లీ: గడువు ముగిసినా అధికారిక నివాసాలు ఖాళీ చేయని మాజీ ఎంపీలకు లోక్సభ ప్యానెల్ షాకిచ్చింది. ల్యూటీన్స్ ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీల నివాసాలకు నీరు, కరెంట్, గ్యాస్ సరఫరా నిలిపేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్సభ ప్యానెల్ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం పోలీసుల సహాయం కావాలని ప్యానెల్ కోరింది. ఎంపీలు సాధారణంగా లోక్సభ రద్దయిన తర్వాత నెలలోపు బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే 16వ లోక్సభ రద్దయిన తర్వాత కూడా లూటీన్స్ ఢిల్లీలోని బంగ్లాల్లో నివాసముంటున్న 27 మంది మాజీ ఎంపీలు మాత్రం ఖాళీ చేయలేదు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎంపీలు అధికారిక నివాసాలు వదిలి వెళ్లకపోవడంతో కొంతమంది ఎంపీలు వెస్టర్న్ కోర్టులోని గెస్ట్ హౌస్ ల నుంచి తమ రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఎంపీలు చాలా సార్లు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దీనిపై లోక్సభ ప్యానెల్ సీరియస్గా స్పందించింది.
