Breaking News
Home / States / ఎన్నారై జయరామ్ హత్యకేసులో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు

ఎన్నారై జయరామ్ హత్యకేసులో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు

హైదరాబాద్: ప్రముఖ ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలు కొత్త కోణాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హత్యకేసులో రౌడీ షీటర్ నగేష్ పాత్ర ఉన్నట్లు తేలింది. పోలీసుల విచారణలో కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డి నిజాలన్నీ ఒప్పుకున్నాడు. అమ్మాయి పేరుతో జయరాంను ట్రాప్ చేసి ప్లాన్‌ ప్రకారమే జయరామ్‌ను ఇంటికి పిలిపించినట్టు విచారణలో నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు మీడియాకు వివరించారు.

మరోవైపు జయరాంను బంధించి దశలవారిగా డబ్బు వసూలు చేసినట్లు రాకేష్‌రెడ్డి తెలిపాడు. ఈ డబ్బు కోసం బాండ్ పేపర్స్‌పై జయరాంతో నగేష్ అనే రౌడీ షీటర్ సంతకాలు చేయించాడు. పక్కా ప్లాన్ ప్రకారమే జయరాం ఆస్తులు కొట్టేయాలని రాకేష్‌ ప్లాన్‌ వేశాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం నగేష్‌తో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ త్వరలో విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.

రాకేశ్‌‌తో టచ్‌‌లో 11మంది ఖాకీ బాస్‌లు!
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేష్‌రెడ్డితో 11 మంది పోలీస్ అధికారులు టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలడం గమనార్హం. జయరాం హత్య తర్వాత 11 మంది పోలీసులకు రాకేష్‌రెడ్డి ఫోన్లు చేసినట్లు కాల్‌డేటాతో తేలింది. వీరిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్‌ స్థాయి అధికారులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా.. హత్య నుంచి తప్పించుకునేలా ప్లాన్‌ ఇచ్చిన ఏసీపీ, నల్లకుంట ఇన్‌స్పెక్టర్ సహకరించినట్లు తెలుస్తోంది. 11 మంది అధికారుల పాత్రపైనా పోలీసుల విచారణ జరుపుతున్నారు. రాకేష్‌రెడ్డితో సంబంధాలున్న పోలీసులకు నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది.

శిఖా వాంగ్మూలం నమోదు..
శిఖాచౌదరి వాంగ్మూలాన్ని వెస్ట్‌జోన్ పోలీసులు నమోదు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే శిఖా ఏసీపీ కార్యాలయానికి వెళ్లింది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ చెబుతున్నారు. జయరాం హత్య తర్వాత ఆయన ఇంటికి శిఖాచౌదరితో కలిసి వచ్చిన సంతోష్‌కుమార్‌ గురించి కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు. మద్యం, పబ్‌ల వ్యాపారంలో సంతోష్‌ ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. త్వరలోనే సంతోష్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.

మాజీ డైరెక్టర్, ఉద్యోగి విచారణ..
ఇదిలా ఉంటే జయరాం హత్య కేసులో ఎక్స్‌ప్రెస్‌ టీవీ మాజీ డైరెక్టర్‌ భానుప్రసాద్‌, కోస్టల్‌ బ్యాంక్ ఉద్యోగి ఈశ్వర్‌ప్రసాద్, అకౌంటెంట్‌ వేణును పోలీసులు విచారించారు. వారి చెప్పిన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

గంట పాటు సీన్ రీకన్‌స్ట్రక్షన్
జయరాం హత్య అనంతరం రాకేష్‌రెడ్డి ఇంట్లో గంట పాటు సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరిగినట్లు పోలీసులు తేల్చారు. జయరాం హత్యకు ముందు, తర్వాత సన్నివేశాన్ని పోలీసులు స్కెచ్‌ వేశారు. గురువారం ఉదయం రాకేశ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు మొత్తం పరిశీలించారు. హత్య తర్వాత కారులో తిరిగిన ప్రాంతాలకు రాకేష్‌రెడ్డిని పోలీసులు తీసుకెళ్లారు.

Check Also

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

Share this on WhatsAppహైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన 3లక్షల 25 వేల మంది విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *