న్యూఢిల్లీ: వివిధ ఈ-కామర్స్ సైట్లలో నిన్నటి వరకు జరిగిన ఫెస్టివ్ సేల్‌లో చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ అమ్మకాల్లో దూసుకుపోయింది. ఏకంగా 5.3 మిలియన్ డివైజ్‌లను విక్రయించింది. వీటిలో 3.8 మిలియన్ స్మార్ట్ఫోన్లు ఉండడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్ల కేటగిరీలో రెడ్మీ నోట్ 7 సిరీస్ ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోగా, అమెజాన్‌లోనూ షియోమీ బ్రాండ్ ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి.
అమ్ముడుపోయిన షియోమీ డివైజ్‌లలో స్మార్ట్ఫోన్లు, ఎంఐ టీవీలు, ఎంఐ బాండ్లు, ఎంఐ పవర్ బ్యాంక్‌లు, ఎంఐ ఇయర్ఫోన్లు, ఎంఐ ఎకో స్టిస్టంలు, యాక్సెసరీలు ఉన్నాయి. మొత్తంగా 2,50,000 ఎంఐ టీవీలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే సమయంలో షియోమీ 2.5 మిలియన్ స్మార్ట్ఫోన్లు విక్రయించింది. ఈసారి అమ్మకాల్లో ఏకంగా 50 శాతం వృద్ధి నమోదైనట్టు షియోమీ ఇండియా ఆన్లైన్ సేల్స్ కేటగిరీ హెడ్ రఘురెడ్డి తెలిపారు. ఈ పండుగను తమతోపాటు 5.3 మిలియన్ల మంది జరుపుకుంటుండడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.