ముంబయి: ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, లోహ షేర్ల అమ్మకాలు ఒత్తిడికి గురైన వేళ దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఆరో సెషన్లోనూ మార్కెట్లు నష్టాలను చవిచూడటం గమనార్హం. సోమవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 37,531 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 11,126 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.05గా ఉంది.
ఉదయం మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమవగా ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సుమారు 300 పాయింట్లు లాభపడి, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో కదలాడింది. అయితే, అంతర్జాతీయ బలహీన సంకేతాల కారణంగా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా ఐటీసీ, టీసీఎస్, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో యస్ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంకు, నెస్లే షేర్లు భారీగా లాభపడగా, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, సిప్లా తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.