Breaking News
Home / States / Andhra Pradesh / అప్పటి నుంచి ఇష్టారాజ్యంగా దేవాలయ నిర్వహణ

అప్పటి నుంచి ఇష్టారాజ్యంగా దేవాలయ నిర్వహణ

విశాఖపట్నం: విశాఖ నగరమంటే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది సంపత్‌ వినాయగర్‌ దేవాలయం. ఎంతో ప్రాశస్త్యం కలిగి భక్తుల కోర్కెలు తీర్చే మందిరంగా విలసిల్లుతోంది. 1962లో అశీలుమెట్‌ ప్రాంతంలో టి.ఎస్‌.రాజేశ్వరన్, టిఎస్‌.సెల్వగణేశన్, ఎస్‌.జి.సంబంధన్‌లు సంపత్‌ వినాయగర్‌ దేవాలయాన్ని నిర్మించారు. పోర్ట్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేసే ఆ ముగ్గురూ తమ వాహనాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా తొలుత ఇక్కడి వినాయకుడికి పూజలు నిర్వహించేవారు. కాలక్రమంలో భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1967లో కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆ దేవాలయంలో శ్రీగణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. 1996లో ఎండోమెంట్స్‌ పరిధిలోకి వచ్చిన దేవాలయం కాలక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ లేదా గ్రూప్‌–1 అధికారి పర్యవేక్షించే ప్రముఖ దేవస్థానంగా ఎదిగింది.

ఆదాయం.. స్థిరాస్తులపై ప్రైవేటు కన్ను..
ఏడాదికి సగటున రూ. 2.50 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న దేవస్థానానికి రూ.15 కోట్ల మేర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయి. సింహాచలం సమీపంలోని గండిగుండం వద్ద దేవస్థానం పేరిట 6.40 ఎకరాల స్థలముంది. అక్కడే మూడున్నర కోట్లతో నిర్మించిన వృద్ధాశ్రమమూ ఉంది. ఇలా కోట్ల విలువైన స్థిర, చిరాస్తులు కలిగి రోజురోజుకీ ఆదాయం వృద్ధి చెందుతున్న దేవస్థానంపై ఫౌండర్‌ ట్రస్టీ వారసుల కళ్ళు పడ్డాయి. ఫౌండర్‌ ట్రస్టీ రాజేశ్వరన్‌ కుమారుడు చోళన్‌ ఆలయాన్ని ఏకస్వామ్య ట్రస్ట్‌కు కట్టబెడుతూ ఆదేశాలివ్వాలని, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను తప్పించాలని(ఈవో ఎగ్జెంప్షన్‌) కోరుతూ గతేడాది.. నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించాడు. ఇలా ఆయన అడిగిన వెంటనే గత డిసెంబర్‌లో ఈవో ఎగ్జింప్షన్‌ ఇస్తూ (ఈవోను బాధ్యతల నుంచి తప్పిస్తూ) టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు వచ్చాయి. వాస్తవానికి అప్పటికే ట్రస్టీ నిర్వాకం, అక్కడే పాతుకుపోయిన కొందరు అర్చకుల వ్యవహార శైలితో సంపత్‌ వినాయగర్‌ దేవస్థానం సంపన్నుల దేవాలయం(రిచ్‌మెన్‌ టెంపుల్‌)గా మారిపోయిందన్న వాదనలుండేవి. ఇక పూర్తిగా ఏక స్వామ్య ట్రస్టీకి బదిలీ అయితే దేవాలయ నిర్వహణ ఎటుపోతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలనే నిజం చేస్తూ దేవాలయ నిర్వహణ అస్తవ్యస్తమైందన్న విమర్శలు చెలరేగుతున్నాయి.

లెక్కలేని ఆదాయం..
వాస్తవానికి ఎండోమెంట్స్‌ పరిధిలో లేని చిన్న చిన్న దేవాలయాల్లో కూడా పూజలు, అర్చనలు, ఇతరత్రా ఆర్జిత సేవలకు టికెట్లు విక్రయిస్తుంటారు. కానీ ఇంతటి ప్రముఖ దేవాలయంలో మాత్రం టికెట్లుండవు, ఆదాయ వ్యయాల లెక్కాపత్రం ఉండదు. ఉత్తరాంధ్రలోనే కొత్త వాహన పూజలు ఎక్కవ జరిగే దేవాలయం ఇదేనని అందరికీ తెలుసు. కానీ టికెట్లు లేకుండానే.. ప్లేటు కలెక్షన్‌ ద్వారా అర్చకులు అందినకాడికి వసూలు చేస్తుంటారు. 2014లోనే ఈ దేవాలయంలో ఆర్జిత సేవల టికెట్లు ప్రవేశపెట్టాలని అప్పటి అధికారులు ప్రతిపాదించి ప్రభుత్వ ఆమోదం కూడా తీసుకున్నారు. కానీ ప్రైవేటుపరం అయ్యాక ఆ ఆదేశాలన్నీ బుట్టదాఖలయ్యాయి.

కుంభాభిషేకం పేరిట వసూళ్ళు..
ఈ ఆలయ కుంభాభిషేకం ప్రతి పన్నెండేళ్ళకోసారి శాస్త్రోక్తంగా నిర్వహించాలి. ఆ క్రమంలో 2002లో జరిగిన తర్వాత 2014లో నిర్వహించాలి. కానీ అప్పట్లో దేవాలయం ఎండోమెంట్స్‌ పరిధిలో ఉండటంతో కుంభాభిషేకం నిర్వహణపై ఎవరూ దృష్టిసారించలేదు. గతేడాది తిరిగి ప్రైవేటు గుప్పిట్లోకి వెళ్ళిన తర్వాత ట్రస్టీ చోళన్‌ కుంభాభిషేకంపై దృష్టి పెట్టారు. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాల పేరిట విచ్చలవిడిగా చేస్తున్న వసూళ్ళు.. లెక్కపత్రం లేకుండా స్వామి వారి ఖజానాకు జమ కాకుండా ఉండటమే వివాదాస్పదమతోంది. ఇక 2014లో జరగాల్సిన కుంభాభిషేకాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, తమకు వీలైనప్పుడు నిర్వహించ వచ్చా… అనే చర్చకు కూడా ఇప్పుడు తెరలేచింది. ఇప్పటికే కుంభాభిషేకం పేరిట సుమారు రూ.30 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.

నా దృష్టికి ఫిర్యాదులు వస్తే: మంత్రి వెల్లంపల్లి
సంపత్‌ వినాయగర్‌ దేవాలయానికి సంబంధించి ఫిర్యాదులు వస్తే తప్పకుండా ఏం చేయాలో ఆలోచిస్తాం. గతేడాది ప్రభుత్వం నుంచి ఏకవ్యక్తి ట్రస్టీకి ఎందుకు బదిలీ అయిందనేది పునఃసమీక్షిస్తానని రాష్ట్ర దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు.

అక్కడ నిర్వహణ బాగోలేదు: వైఎస్సార్‌సీపీ నేత విజయనిర్మల
సంపత్‌ వినాయగర్‌ దేవాలయం అంటే అందరికీ సెంటిమెంట్‌. కానీ దాని నిర్వాహణ సరిగ్గా లేదన్నది వాస్తవం. అక్కడ ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యమైపోయింది. సంపన్నుల దేవాలయమనే అపప్రద ఉంది. ఈ దేవాలయ వ్యవహారాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు సమన్వయకర్త అక్కర మాని విజయనిర్మల అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *