లఖ్‌నవూ: హిందూ సమాజ్‌వాది పార్టీ నాయకుడు కమలేశ్ తివారీని గత శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం సూరత్‌కు చెందిన అష్ఫాక్ హుస్సేన్, మోయిదీన్ పఠాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేయడంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి సంఖ్య ఆరుకు చేరింది. హత్యకు ముందు రోజు రాత్రి నిందితులు లఖ్‌నవూలోని ఓ హోటల్లో తమ అసలు పేర్లతోనే గదిని తీసుకున్నారు. హత్య అనంతరం వారి దుస్తులను, హత్యకు ఉపయోగించిన కత్తిని వారు హోటల్ గదిలోనే వదిలి సూరత్‌కు తిరిగి వెళ్లారు.
తాజాగా కమలేశ్ పోస్ట్‌మార్టం నివేదికను వైద్యులు బుధవారం వెల్లడించారు. కమలేశ్ ముఖ భాగంలో మాత్రమే దుండగులు 15 సార్లు పొడిచారని, రెండు సార్లు మెడ భాగాన్ని కత్తితో కోశారని అయినప్పటికీ అతను చనిపోలేదనుకుని నుదుటిపై తుపాకీతో కాల్చి చంపారని వారు నివేదికలో పేర్కొన్నారు.