అందించే బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే
25 లోక్‌సభ స్థానాల్లో స్కిల్ సెంటర్లు
శిక్షణ పొందినవారికి త్వరగా ఉద్యోగాలు
ఉపాధి కల్పనకు ‘75ు స్థానికులకే’ చట్టం
సూరంపల్లి సీపెట్ ప్రారంభోత్సవంలో జగన్
రెండో సీపెట్ నాయుడుపేటలో ఏర్పాటు
కేంద్ర మంత్రి సదానంద గౌడ వెల్లడి
విజయవాడ: రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టబోయే పారిశ్రామిక సంస్థలకు నైపుణ్యం కలిగిన యువతను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇందుకోసం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా సూరంపల్లిలో రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) నూతన భవనాన్ని గురువారం కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి కె.సదానందగౌడతో కలిసి సీఎం ప్రారంభించారు. శిలాఫలకం ఆవిష్కరణతో పాటు ప్రాంగణంలో ఇద్దరూ మొక్క నాటారు. అనంతరం సీపెట్ విద్యార్థులు ప్రదర్శించిన ప్లాస్టిక్ డిజైన్స్ నమూనాల ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘సీపెట్‌లో శిక్షణ పొందిన విద్యార్థులతో పాటు నైపుణ్య శిక్షణ పొందిన వారికి త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఎవరు పరిశ్రమలు పెట్టినా 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాలని చట్టం చేశాం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పారదోలేందుకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఇక్కడ చట్టం తీసుకొచ్చాం. పరిశ్రమలు పెట్టే వారికి నైపుణ్యవంతమైన యువతను అందించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. 25 లోక్‌సభ స్థానాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేస్తాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడానికి రానున్న రోజులలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం’ అని చెప్పారు.
ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో సరికొత్త ఆవిష్కరణలు
సదానందగౌడ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన రాష్ర్టాల ఆర్థికాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రెండో సీపెట్ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘కేంద్రం ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశోధనలపై దృష్టి సారించింది. సీపెట్ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో సరికొత్త ఆవిష్కరణలకు రూపకల్పన జరుగుతోంది. విజయవాడ కేంద్రంగా 2015లోనే సీపెట్ ఏర్పాటుకు బీజం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.25 కోట్లు భరించడంతో మొత్తం రూ.50 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణం సాకారమైంది. దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం’ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి తన ప్రసంగంలో కాస్త తడబడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ను తెలంగాణ డైనమిక్ సీఎంగా ముందు పేర్కొన్నారు. తర్వాత పొరపాటును దిద్దుకుని ఆంధ్రప్రదేశ్ డైనమిక్ సీఎంగా అభివర్ణించారు. కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, ఎరువుల శాఖ కార్యదర్శి రాఘవేంద్రరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారథి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.