రామ్‌పూర్: రామ్‌పూర్ ఉప ఎన్నిక సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన మేకల్ని, కోళ్లను, గేదెలను దొంగిలించినట్లు ఓ వ్యక్తి ఆజమ్ ఖాన్‌పై కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘నా మీద ఐపీసీ 307(హత్యాయత్నం) కేసు మోపారు. నన్ను నేను నిరూపించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. నా మీద దొంగతనం కేసు కూడా పెట్టారు. మేకలను, కోళ్లను, గేదెల్ని దొంగిలించినట్లు నాపై ఆరోపణలు చేశారు. అలాంటి పనులు నేను చేస్తానా? నేను తప్పులు చేస్తుంటే దేవుడు నన్ను ఎందుకు శిక్షించడం లేదు? రామ్‌పూర్ ప్రజల ప్రయోజనాల కోసం నా డబ్బులు ఖర్చుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేను కోళ్లను దొంగిలిస్తానా?’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఆజమ్ ఖాన్‌పై ప్రస్తుతం వివిధ అంశాలకు సంబంధించి 80 కేసులు నమోదయ్యాయి. ఈనెల 5న ఆయన సిట్ ఎదుట కూడా హాజరయ్యారు. ఈయనపై ఉన్న కేసుల విచారణ ఈనెల 29న జరగనుంది. ఇక రామ్‌పూర్‌లో జరగనున్న ఉపఎన్నికల్లో ఆజమ్ భార్య తజీన్ ఫాతిమా ఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఆమె తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు.