Breaking News
Home / National / శ్రీనగర్ ఆదివారం సంతకు పోటెత్తిన జనం

శ్రీనగర్ ఆదివారం సంతకు పోటెత్తిన జనం

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఆంక్షలు అమలవుతున్నప్పటికీ ఆదివారం శ్రీనగర్ సంతకు భారీ జన సందోహం వచ్చింది. ప్రభుత్వ అధికారుల కథనం ప్రకారం కశ్మీరులో ప్రధాన మార్కెట్లను మూసివేశారు, ప్రభుత్వ రవాణా వాహనాలు నడవలేదు. కానీ ప్రైవేటు వాహనాలు నగరంలో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆటో రిక్షాలు, దూర ప్రాంతాలకు వెళ్ళే క్యాబ్‌లు నడుస్తున్నాయి.

శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సిటీ సెంటర్‌లో టీఆర్‌సీ చౌక్-బటమలూ వద్ద ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఈ ఆదివారం జరిగిన సంతలో పదుల సంఖ్యలో వ్యాపారులు తమ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ప్రజలు వేలాది మంది వచ్చి బట్టలతో సహా ఇతర వస్తువులు కొనుక్కున్నారు.

ఇంటర్నెట్ సర్వీసులు ఇప్పటికీ అందుబాటులో లేవు. పోస్ట్ పెయిడ్ టెలిఫోన్ సేవలను ఇటీవలే పునరుద్ధరించారు. పర్యటకుల సందర్శనకు కూడా అనుమతించారు.

భారత రాజ్యాంగంలోని అదికరణ 370 ప్రకారం జమ్మూ-కశ్మీరుకు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీరు, లడఖ్ అనే కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రులు పరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముప్తీలను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. వేర్పాటువాద నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *