తిరుపతి: తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 6917 మంది భక్తులు దర్శించుకున్నారు. 2709 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. కానుకల రూపేణ ఆలయానికి రూ.64 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా టీటీడీ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
కరోనా సోకిన అర్చకులకు పూర్తి వైద్య సహాయం అందిస్తున్నామని, భక్తులు యథావిధిగా ఆలయానికి రావచ్చని వెల్లడించారు. కరోనా కారణంగా ఆలయాన్ని మూసివేయమని ఆయన స్పష్టం చేశారు. ఆలయంలో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే అలిపిరి వద్ద కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని,ఆలయంలో ట్రైజోన్ ఓజోన్ పొగమంచు రూపంలో స్ప్రేయింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు భక్తులు ప్రవేశించే స్కానింగ్ సెంటర్ వద్ద, విధి నిర్వహణలో ఉన్న అర్చకులు, ఉద్యోగులు ప్రవేశించే బయో మెట్రిక్ వద్ద వీటిని నెలకొల్పామని ఈవో తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని , చేతుఉ శుభ్రం చసుకుని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.