Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అప్పటికీ, ఇప్పటికీ తేడా జగన్ సీఎం కావడం ఒకటే

అప్పటికీ, ఇప్పటికీ తేడా జగన్ సీఎం కావడం ఒకటే

అక్రమాస్తుల కేసులో ప్రతి వారం విచారణకు హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు వేసిన పిటీషన్‌పై వాదనలు శుక్రవారం ముగిశాయి. హాజరు మినహాయింపునకు సంబంధించి ఇటు సీబీఐ తరఫు న్యాయవాదులు, అటు జగన్ తరపు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సీబీఐ కోర్టు న్యాయమూర్తి తీర్పును వచ్చే నెల ఒకటవ తేదీకి వాయిదా వేశారు.

గతంలో జగన్‌ కోర్టు విచారణకు హాజరైనపుడు స్వంత ఖర్చుతో వచ్చేవారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన క్రమంలో ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, అలాంటప్పుడు అసలే ఆర్ధిక లోటుతో ఉన్న ఖజానాపై మరింత భారం మోపకూడదనే తాము హాజరు మినహాయింపు కోరుతున్నామన్నారు. వైఎస్ జగన్‌పై కేసు నమోదైనప్పటి నుంచి ఆయన కోర్టు విచారణకు సహకరిస్తున్నారని, కోర్టు అనుమతి లేకుండా ఎటు వెళ్లలేదని, అందుకే ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న జగన్‌పై ఉన్న బాధ్యతలను గమనించి ఆయనకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. సీబిఐ వేసిన కౌంటర్‌లో వాడిన పదజాలంపై జగన్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అలాంటప్పుడు ఆయన గౌరవనీయ ముఖ్యమంత్రి అనే పదజాలాన్ని వాడాలని సిబిఐ తరపు న్యాయవాదులకు గుర్తు చేశారు.

మరోవైపు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు ప్రతివారం రావాల్సిందేనంటూ సిబిఐ దాఖలు చేసిన స్ట్రాంగ్ కౌంటర్ పిటీషన్‌పై నిరంజన్ రెడ్డి సుదీర్ఘవాదనలు చేశారు. గతంలో తాము హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లను తాజా పిటీషన్‌ను ఒకే విధంగా చూడరాదని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆయన రాష్ట్ర పాలనాబాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జగన్ కోర్టుకు ప్రతివారం హాజరు కావాలంటే వారంలో కనీసం రెండు రోజులు పనికి ఇబ్బందులు కలుగుతాయన్నారు. గురువారం రాత్రి విజయవాడ నుంచి బయల్దేరి అదేరోజు హైదరాబాద్ చేరుకుని ఆ మర్నాడు శుక్రవారం కోర్టు విచారణకు హాజరై తర్వాత రాత్రి మళ్లీ విజయవాడకు చేరుకోవడం వల్ల సమయం వృధా అవుతుందన్నారు. అంతేకాక ఆయన విచారణకు హాజరయ్యే క్రమంలో సెక్యూరిటీ ఇతరత్రా ఖర్చు బాగా అవుతుందన్నారు.

వైఎస్ జగన్ తరఫు న్యాయవాది సుదీర్ఘ వాదనలు చేసినప్పటికి వాటిలోని ప్రతి అంశాన్నీ సీబీఐ న్యాయవాది సురేందర్ రావు తిప్పికొట్టారు. గతంలో వైఎస్ జగన్ తరఫున హాజరు మినహాయింపు కోరుతూ వేసిన పిటీషన్లను ఇదే కోర్టు మరియు హైకోర్టు తిరస్కరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితులు ఏమీ మారలేదని, కేవలం జగన్ ముఖ్యమంత్రి కావడమే మార్పు అన్నారు. ఎంపీగా ఉండి జైల్లో ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారని, ముఖ్యమంత్రి బాధ్యతల నిర్వహణ పేరిట మినహాయింపు ఇస్తే తప్పనిసరిగా సాక్షులు ప్రభావితం అవుతారన్నారు. జగన్ తీవ్రమైన ఆర్ధిక నేరానికి పాల్పడ్డాడని ఆ విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు కూడా బెయిల్ పిటీషన్ సందర్భంలో ప్రస్తావించిందన్నారు. తీవ్రమైన ఆర్ధిక నేరాలకు పాల్పడేవారు ఏ స్ధానంలో ఉన్నా వారికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వచ్చేనెల ఒకటవ తేదీన ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *