ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, త్వరలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 155.24 పాయింట్లు నష్టపోయి 38.667.33 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి 34.75 పాయింట్లు నష్టపోయి 11,475.50 వద్ద స్థిరపడింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.75గా నమోదైంది. ఎన్ఎస్ఈలో యస్‌బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, జీ ఎంటర్టైన్మెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నేలచూపులు చూశాయి. భారతీ ఎయిర్టెల్, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఐఈసీ షేర్లు లాభపడ్డాయి.
