Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రెండు బెత్తం దెబ్బలా!

రెండు బెత్తం దెబ్బలా!

దిశ నిందితులకు అది చాలా?
పవన్‌కు మహిళలంటే ఎంత చులకన!
అమిత్‌ షా అంటే భయం కాదు
కేంద్రం అంటే గౌరవం: సుచరిత
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. పవన్‌ని పట్టించుకోనవసరం లేదంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పికొడుతూ ఎద్దేవా చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దిశపై అత్యాచారం చేసిన నిందితులను దేశమంతా కఠినంగా శిక్షించాలని అంటుంటే.. పవన్‌ కల్యాణ్‌ రెండు బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. పవన్‌ అవగాహనారాహిత్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా నాయకుడిగా చెప్పుకునే పవన్‌ మహిళల పట్ల ఇలాగేనా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే పవన్‌కు ఎంత చులకనభావమో ఈ వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోందన్నారు.

పవన్‌ లాంటి వారు ఎప్పుడైనా అధికారంలోకి వస్తే మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. దిశ ఘటనపై సీఎం జగన్మోహనరెడ్డి చలించిపోయారని, అందుకే అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ఏ పార్టీతో ఉన్నారో ఆయనకే తెలియదన్నారు. అయినా తన సీటు కూడా తాను గెలుచుకోలేని నాయకుడి గురించి మాట్లాడడం అంత మంచిది కాదంటూ ఎగతాళి చేశారు. బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారంటూ కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మత మార్పిడి ఇష్టప్రకారం చేసుకుంటే తప్పేంటని మంత్రి ప్రశ్నించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ… గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయొద్దని ఎవరైనా అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు. అమిత్‌షాతో సహా ఎవరన్నా వైసీపీ భయపడదని, కేంద్రమంటే అందరికీ గౌరవం ఉంటుందని అన్నారు.

సారీ… ఏం మాట్లాడాలి!: చెవిరెడ్డి
సీఎం జగన్మోహనరెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించమని విలేకరులు కోరగా… ‘నేను రెండు సార్లు ఎమ్మెలేగా గెలిచాను. పవన్‌ కల్యాణ్‌ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రెండు సార్లు గెలిచిన నేను, రెండు సార్లు ఓడిపోయినవాని గురించి మాట్లడమంటే ఏం మాట్లాడాలి? సారీ’ అంటూ చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.

పవన్‌కు ఒంటినిండా తిక్క: కోరుముట్ల
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఒంటినిండా తిక్క ఉంది. పిచ్చోడిలా మాట్లాడుతున్నారు. ఒక పిచ్చోడు జగన్‌ను సీఎంగా గుర్తిస్తే ఎంత? గుర్తించకపోతే ఎంత?’’ అని వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారంఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు చంద్రబాబు పెంపుడు ప్యాకేజీగా పిలుస్తున్నారన్నారు. చంద్రబాబుకు పవన్‌ దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. తనకు కుల మతాలు లేవని చెప్పే పవన్‌… ఒక రోజు హిందువుల గురించి, మరో రోజు క్రిస్టియన్ల గురించి మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌కు కులమూ మతమూ లేదనీ, ఆయన మతం మానవత్వమనీ, మాట నిలబెట్టుకునే కులమని శ్రీనివాసులు అన్నారు. పవన్‌ అంతర్జాతీయ పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శించిన శ్రీనివాసులు… పవన్‌ పెళ్లి చేసుకున్న రష్యన్‌ భార్యకు పుట్టిన కూతురు కులం పాస్‌పోర్టులో ఏముందో చెప్పాలని నిలదీశారు. మతం లేని వాళ్లు ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ ఉన్నారన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *