న్యూఢిల్లీ: పాక్ మాటల్లోని డొల్లతనం మరోసారి బయటపడింది. తప్పుడు ప్రకటనలు చేయడంలో పాక్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందనే విషయం హిందన్ వైమానిక స్థావరంలో భారత వైమానికి దళం మంగళవారం నిర్వహించిన 87వ వార్షికోత్సవాల్లో మరోసారి వెలుగుచూసింది. పాక్ అబద్ధాల గుట్టు రట్టయింది. ఇవాళ ఐఏఎఫ్ యుద్ధ విమానాల విన్యాసాల్లో భాగంగా సుఖోయ్ 30 ఏంకేఐలు గగనతలంలో సందడి చేశాయి. గాల్లో ఎగురుతూ రకరకాల ఫీట్లు చేశాయి. రెండు సుఖోయ్-30 ఎంకేఐలు గగన విన్యాసాల్లో పాల్గొని ‘అవెంజర్ ఫార్మేషన్’లో ఆహూతులను కట్టిపడేశాయి. ఇక్కడే ఆసక్తికర విషయం వెలుగుచూసింది.
గగనతల విన్యాసాల్లో పాల్గొన్న రెండు సుఖోయ్-30 ఎంకేఐలలో ఒకటైన ‘ఎవెంజర్ 1’ విమానాన్నే పాకిస్థాన్ గత ఫిబ్రవరి 27న కూల్చేసినట్టు ప్రకటించుకోవడం ఆసక్తికరం. పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే మరో విషయం కూడా ఉంది. ఏదైతే తాము కూల్చేశామని పాక్ చెప్పుకుందో అదే ‘ఎవెంజర్ 1’ (సుఖోయ్-30ఏంకేఐ) ఇవాల్టి వాయుసేన విన్యాసాల్లో స్వైరవిహారం చేయడంతో పాటు ఫిబ్రవరి 27న ఆ విమానాన్ని నడిపిన ఇద్దరు ఐఏఎఫ్ సిబ్బందే ఇప్పుడు ఈ విమానాన్ని నడపడం మరింత ఆసక్తికరం.
గత ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడుల ప్రతిగా ఆ మరుసటి రోజే భారత్‌పై పాక్ వాయుదాడులకు ప్రయత్నించినప్పుడు భారత్ వాయుసేన బలంగా తిప్పికొట్టింది. అమెరికా తయారు చేసిన ఎఫ్-16తో పాక్ దాడికి దిగినప్పుడు దానిని మిగ్-21 బైసన్‌తో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూల్చేశాడు. అయితే, ఎఫ్-16 కూలిపోలేదంటూ బుకాయించిన పాక్ తమ వాదనకు బలం చేకూరేందుకు తామే స్వయంగా సుఖోయ్-30ఎంకేఐని కూల్చేశామని వాదన చేసింది. ఆ తర్వాత మిగ్-21 బైసన్ పీఓకేలో కూలిపోవడం, పట్టుబడిన అభినందన్‌ను దౌత్య ఒత్తిడికి తలొగ్గి పాక్ తిరిగి భారత్‌కు అప్పగించడం జరిగింది. ఆసక్తికరంగా, ఇవాల్టి ఐఏఎఫ్ వార్షికోత్సవంలో మిగ్-21 బైసన్‌ను అభినందన్ వర్ధమాన్ స్వయంగా నడిపి అందరి హృదయాలను మరోసారి దోచుకున్నారు.