న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారంనాడు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనందున వాటిపై సమాధానం చెప్పేందుకు తమకు కొంత సమయం కావాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో నాలుగు వారాలు గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.