Breaking News
Home / National / దిశ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

దిశ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశం

సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
కమిషన్‌కు సుప్రీం విశ్రాంత జడ్జి జస్టిస్‌ వికాస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వం
సభ్యులుగా హైకోర్టు మాజీ జడ్జి రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌
ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలి
ఇతర దర్యాప్తులేవీ జరగరాదు
కమిషన్‌కు సీఆర్‌పీఎఫ్ భద్రత
మీడియాపై ఆంక్షలకు నిరాకరణ
చనిపోయిన వారిపై ప్రాసిక్యూషనా? సాక్ష్యాలేవీ?
ప్రజలకు నిజాలు తెలియాలి: ధర్మాసనం
మృతదేహాలు భద్రపరచాలని ఆదేశం
దశ దిశల్లో మార్మోగిన హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్లో మరో సంచలనం. నలుగురు నిందితుల కాల్చివేతపై త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్‌లో జరిగినది పోలీసు తీర్పా లేక వాస్తవమా? అన్నది ఆ కమిషన్‌ ఆరు నెలల్లో తేల్చాలి. ఏడాది పాలన పూర్తిచేసుకున్న కేసీఆర్‌ ప్రభుత్వంపై విచారణ సమయంలో చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే సంధించిన వాగ్బాణాలు మౌలికమైన ప్రశ్నలనేకం లేవనెత్తుతున్నాయి. నేరన్యాయ శిక్షా వ్యవస్థను కాచి వడబోసిన దిగ్గజాలను ఈ కమిషన్‌లో సభ్యుల్ని చేయడంతో కేసు ఏ మలుపు తిరుగుతుందోనన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది.

న్యూఢిల్లీ: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపైనా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఎన్‌కౌంటర్‌ విషయంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినా కోర్టు అందుకు అంగీకరించలేదు.

ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేయించాలని న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. వీరితో పాటు మరో ఇద్దరు లాయర్లు- ముకేష్‌ కుమార్‌ శర్మ, మనోహర్‌ లాల్‌ శర్మ కూడా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌ విచారణ ప్రారంభించే మొదటి రోజు నుంచి ఆరు నెలల్లో నివేదిక అందించాలని, మొదటి విచారణ తేదీని కమిషన్‌ ఖరారు చేసుకోవాలని స్పష్టం చేసింది.

తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా శవాలను భద్రపరిచే విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని కూడా బెంచ్‌ తెలిపింది. ఈ కమిషన్‌కు సీనియర్‌ న్యాయవాది పరమేశ్వరన్‌ న్యాయ సలహాదారుగా ఉంటారని పేర్కొంది. ఈ కమిషన్‌కు కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వెయిరీ చట్టంలో పేర్కొన్న అధికారాలు వర్తిస్తాయని అంటూ హైదరాబాద్‌ కేంద్రంగా కమిషన్‌ పనిచేయాలని సూచించింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. కమిషన్‌కు కేంద్రీయ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌తో భద్రత కల్పించాలని తేల్చిచెప్పింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఏ కోర్టు, లేదా ఇతర సంస్థ హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై విచారణ చేపట్టరాదని కూడా ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో సాగుతున్న కేసు, జాతీయ మానవహక్కుల కమిషన్‌ జరుపుతున్న విచారణలపై కోర్టు స్టే ఇచ్చినట్లే!

మీడియా మీద ఆంక్షలకు నిరాకరణ
కమిషన్‌ విచారణకు సంబంధించి మీడియాపై ఆంక్షలు విధించాలని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ కోరినా ధర్మాసనం అందుకు సుముఖత చూపలేదు. అయితే కమిషన్‌ విచారణ కార్యకలాపాలపై మీడియా కథనాలు ప్రచురించే విషయమై అభిప్రాయాలు తెలపాల్సిందిగా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ), ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (పీటీఐ) వార్తా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. నిందితులు నేరం చేశారని కోర్టులో తేలకముందే వారిని దోషులుగా చిత్రీకరిస్తూ మీడియా ప్రజలను రెచ్చగొట్టిందని పిటిషనర్‌ శర్మ ఆరోపించారు. మరణించిన నిందితుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కూడా ఆయన కోరారు. ‘‘అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, ఆ నేరం ఆ నలుగురే చేసి ఉండవచ్చు. పరస్పర భిన్నమైన వాదనలు వస్తున్నాయి కాబట్టి మొదట దర్యాప్తు జరగాలి’ అని సీజే అన్నారు.

లేని నిందితులపై విచారణా?
కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) కేసులో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మృతిచెందిన నిందితులపై హత్యా యత్నం సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి పోలీసు కమిషనర్‌ హోదా గల ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారని వివరించారు.

అంతే కాకుండా, జాతీయ మానవ హక్కుల సంఘం కూడా విచారణ చేపట్టిందని గుర్తు చేశారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ… ’’మరణించిన నిందితులపై విచారణ జరుగుతోందని చెబుతూ మీరు దర్యాప్తు వద్దనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అక్కడ జరిపే విచారణలో ప్రాసిక్యూషన్‌ సాక్ష్యులు ఉండరు. అసలు విచారణే ఉండదు. అసలది విచారణే కాదు. కేవలం విశ్వసనీయతకు సంబంధించిన అంశం. ఇప్పుడు నిందితులు లేరు. కాబట్టి దోషులుగా తేలేవారు, శిక్ష అనుభవించేవారు ఎవరూ ఉండరు.

తీర్పులు ఉండవు. మీరు ఏమీ చెయ్యలేదని ఎవరు వచ్చి చెప్పగలరు? ఎవరి సాక్ష్యం ఆధారమవుతుంది? కాబట్టి ఇదంతా మీ ప్రతివాదం (డిఫెన్స్‌) కోసమే!.. …మీరు చేసే విచారణ అపహాస్యం అవుతుంది.’’ అని సీజే బోబ్డే వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజాలు తెలియాలని, మీరు చెప్పినవే నిజాలని ఊహించుకోలేమని స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన నిజానిజాలు తెలియకముందే ఈ దశలో ఎవరు దోషులో చెప్పలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే ఘటనపై దర్యాప్తు చేయించాలని భావిస్తున్నామని పేర్కొంది. ఈ విషయంలో నిజాయితీగా ఉండాలని ముకుల్‌ రోహత్గీకి సూచించింది.

ఈ కేసుతో మీకేం సంబంధం..పిటిషనర్‌కు ధర్మాసనం ప్రశ్న
ఈ ఘటనలో మీకేం సంబంధం… ఎందుకు పిటిషన్‌ దాఖలు చేశారని పిటిషన్‌ జీఎస్‌ మణిని ఽధర్మాసనం ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానమిస్తూ… తాను ఈ దేశ పౌరుడినని, ఎన్‌కౌంటర్‌ ద్వారా మానవ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25ను ఉల్లంఘించారని
తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *