Breaking News
Home / National / ఉద్యోగులకు బెంజ్ కార్లు..!

ఉద్యోగులకు బెంజ్ కార్లు..!

గుజరాత్: సూరత్ వ్యాపారి సావ్జీ ధోలాకియా … ఈ పేరు చెబితే చాలు… సిబ్బందిపై అపారమైన ప్రేమను కురిపించే యజమాని గుర్తొస్తారు. పని చేసే వారిని కేవలం పనివాళ్లుగా మాత్రమే చూసే ఈ రోజుల్లో.. తన సిబ్బందికి విలువైన బహుమతులు ఇస్తూ.. వారిని ఆనందంలో ముంచెత్తుతుంటారు ధోలాకియా. గతంలో దీపావళికి 51 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వడంతో పాటు 1260 కార్లు, 400 ఫ్లాట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2017 కొత్త సంవత్సరం కానుకగా 1200 కార్లు ఉద్యోగులకు ఇచ్చారు. ఇవి ఆయన ఉదార స్వభావానికి మచ్చుతునకలు. తాజాగా తన కంపెనీలో గత 25 ఏళ్లుగా పని చేస్తున్న ముగ్గురు సీనియర్ ఉద్యోగులకు మూడు కోట్ల రూపాయలు విలువ చేసే మూడు మెర్సిడెజ్ బెంజ్ కార్లను కానుకగా ఇచ్చారు. గుజరాత్ మాజీ సీఎం, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ ఆనంది బెన్ చేతుల మీదుగా వారికి కారు తాళాలు అందజేశారు. ఈ ముగ్గురు కూడా యువకులుగా ఉన్నప్పటి నుంచి తన దగ్గర పని చేస్తున్నారని.. తమ కంపెనీలోనే సీనియర్ మోస్ట్ ఉద్యోగులని ధోలాకియా వారిని ప్రశంసించారు.

సిబ్బంది పనితనాన్ని బట్టే బహుమతులు అందజేస్తుంటానని చెబుతుంటారు ధోలాకియా. సూరత్ కేంద్రంగా ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ పేరుతో కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. వజ్రాలు, వస్త్రాల వ్యాపారంలో 40 ఏళ్ల అనుభవం ఆయన సొంతం. ఓ మారుమూల గ్రామం నుంచి కేవలం 12 రూపాయల 50పైసలతో సూరత్‌కు వచ్చిన సావ్జీ ధోలాకియా.. ఇప్పుడు రూ. 6వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఆయన దగ్గర 5500మంది పని చేస్తున్నారు.

Check Also

రెస్టారెంట్ పెట్టేందుకు బాలిక కిడ్నాప్… పోలీసుల రాకతో..

Share this on WhatsAppపూణె: సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాలని భావించిన ఇద్దరు వ్యక్తులు 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *