న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వోద్యోగులకు 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మోదీ ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. ఈ నిర్ణయం ఈ నెల 31న అమల్లోకి వస్తుండగా దీంతో దాదాపు 4.5 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు లబ్ధి పొందుతారు.
జమ్మూ-కశ్మీరు రాష్ట్రంలో పని చేసిన ఉద్యోగులు ఈ నెల 31 నుంచి జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగులుగా మారుతారు. అప్పటి నుంచి 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలను చెల్లించే ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.4,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బాలల విద్యా భత్యం, వసతి గృహాల భత్యం, రవాణా భత్యం, సెలవుల్లో ప్రయాణాలపై రాయితీలు, నిర్ణీత వైద్య భత్యం రూపంలో దీనిని చెల్లిస్తారు.