అమరావతి: రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం అట్టహాసం చేస్తోందని, వాస్తవానికి ఇచ్చిన మాట తప్పి అర్హులకు అన్యాయం చేసిందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ రూ.50 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు విడతల వారీగా ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని నరేంద్ర ఆరోపించారు. ఇవాళ రైతు భరోసా పథకాన్ని, కేంద్రం ఇచ్చే ప్రధాని కిసాన్ యోజనతో కలిపి ఇస్తున్నారని అన్నారు. కేంద్రం రైతులకు ఇచ్చిన 6వేల మొత్తాన్ని రాష్ట్రం తన ఖాతాలో వేసుకుందని ఎద్దేవా చేశారు. ముందు ప్రకటించిన దానికంటే 10 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేశారని, ఓసీ కౌలు రైతులకు భరోసా ఇవ్వలేదని చెప్పారు. కులాల పేరుతో రైతులను విడదీసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపించారు.