హైదరాబాద్: నిన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపడింది. అగ్గి రాజేసి చలికాచుకోవద్దని, సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇరు పక్షాలూ ఒక అడుగు వెనక్కి తగ్గి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోడానికి ముందుకు రావాలని సూచించింది. పంతాలకు, పట్టింపులకు పోవద్దని హితవు పలికింది. తక్షణమే ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)ను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఆర్టీసీ ఎండీని నియమించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే డీజీపీ కార్యాలయం నుంచి అందుబాటులో ఉండాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, అకున్ సబర్వాల్, స్టీఫెన్ రవీంద్రకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. ఈ ముగ్గురిలో ఒకరు ఆర్టీసీ ఎండీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.