Breaking News
Home / States / కల్లులో కలిపే భయంకరమైన కెమికల్స్‌ ….

కల్లులో కలిపే భయంకరమైన కెమికల్స్‌ ….

విజృంభిస్తున్న మాఫియా
నగర శివారుల్లో జోరుగా కల్తీ కల్లు విక్రయం
తాగిన వారు చనిపోతున్న వైనం
ప్రాణాంతకమైన కెమికల్స్‌ దిగుమతి చేసుకొని తయారీ
బినామీల పేరుతో లైసెన్స్‌లు
కోట్ల రూపాయలు సంపాదిస్తున్న కేటుగాళ్లు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న ఎక్సైజ్‌ అధికారులు
హైదరాబాద్‌ సిటీ: నగర శివారు ప్రాంతాల్లో ‘కల్తీ కల్లు’ ఏరులై పారుతోంది. ప్రమాదకరమైన కెమికల్స్‌తో తయారు చేస్తున్న మాఫియా అమాయకుల ప్రాణాలతో ఆటలాడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత కెమికల్స్‌ను నగరానికి దిగుమతి చేసుకొని కల్తీకల్లు తయారు చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్నా… ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అల్ర్పాజోలమ్‌ కలిపిన కల్లు తాగిన వారు దానికి వ్యసనపరులుగా మారి ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. 2017లో ఇలాంటి దుకాణాలపై ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొరడా ఝుళిపించడంతో కల్తీ మాఫియాకు అడ్డుకట్టపడింది. కొంతకాలం సద్దుమణిగిన ఈ దందా తిరిగి పుంజుకున్నట్టు తెలుస్తోంది.

బోగస్‌ సొసైటీలు… సభ్యత్వాలు
గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వరుసగా దాడులు నిర్వహించి ఎక్కడికక్కడ కల్తీకల్లు విక్రయిస్తున్న దుకాణాలను మూసివేశారు. కల్లులో కలిపే అల్ర్పాజోలమ్‌ వంటి రసాయనాలను సీజ్‌ చేశారు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, పటాన్‌చెరు వంటి అనేక ప్రాంతాల్లో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. నకిలీ గీత కార్మికుల పేరుతో లైసెన్స్‌ పొంది ఈ దందాను కొనసాగిస్తున్నారు. గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు అన్యాయం జరుగుతోంది. బోగస్‌ సొసైటీలు, సభ్యత్వాలు లెక్కకు మించి పెరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

అసలైన గీత కార్మికులకు అన్యాయం
కాళ్లకి బంధం.. నడుముకు మోకు.. వెనక లొట్టి.. పక్కన కల్లుగీసే కత్తుల పొది… నిత్యం చెట్లు ఎక్కిదిగే గీత కార్మికుల వేషధారణ ఇది. వీరి వృత్తి ప్రతినిత్యం మృత్యువుతో పోరాటమని చెప్పాలి. చెట్లపైకి ఎక్కేవీరు పాములు, తేళ్లతో సహజీవనం చేస్తుంటారు. పాము కాటుకు గురైనా, కాలుజారి చెట్టుపైనుంచి జారిపడినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కల్లుగీతను బతుకుదెరువుగా చేసుకున్న వారు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గీత కార్మికులు తక్కువగా ఉంటారు. బడాబాబులు బినామీల పేరుతో టీఎ్‌ఫటీ లైసెన్స్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పదిమంది లైసెన్స్‌ దారులకు కొంత డబ్బు చెల్లించి దుకాణాలు నడుపుతున్నారు. కల్తీ కల్లు విక్రయిస్తూ కోట్ల రూపాయలు సంపాదించుకొని అసలైన గీత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని కొందరు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ప్రభుత్వం, ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి కెమికల్స్‌ దిగుమతి
కల్లులో కలిపే భయంకరమైన కెమికల్స్‌ను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. కిలోకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. కెమికల్స్‌ను టీ స్పూన్‌ పరిమాణంలో కలిపి దాంతో 40 పెట్టెలకు సరిపడా కల్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ కన్నా ప్రమాదకరమైన మత్తుపదార్థాల కారణంగానే కల్తీ కల్లుకు వ్యసనపరులుగా మారుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాడులు నిర్వహించినప్పుడు కల్లులో కల్తీ కలిపినట్లుగా ఎక్సైజ్‌ అధికారులు తెలుసుకునే మెషినరీకి సైతం దొరక్కుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఆ విషయం బయట పడకుండా ఉండటానికి మరో రకమైన కెమికల్స్‌ను కూడా వాడుతున్నట్టు తెలుస్తోంది. అధికారులు కల్తీ మాఫియాపై నిఘా పెట్టి అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అడ్డాకూలీలు.. పారిశుధ్య కార్మికులే బలి
కల్తీకల్లు తాగుతున్న వారంతా అడ్డా కూలీలు, పారిశుధ్య కార్మికులు, మధ్య తరగతి ప్రజలే. దీనికి అలవాటు పడిన వారు వ్యసనపరులుగా మారుతున్నారు. తాగడం ఆపేస్తే ఫిట్స్‌ రావడం, నాలుక కరుచుకొని వెకిలి చేష్టలు చేయడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడతారని వైద్యులు చెబుతున్నారు. డైజోఫామ్‌, క్లోరోఫామ్‌, అల్ర్పాజోలమ్‌ వంటివి కలిపిన కల్లు తాగడం వల్ల మానసిక స్థితి గతి తప్పుతుందంటున్నారు. ఈ క్రమంలో చిన్న వయసులోనే గుండెపోటు రావడం, కల్తీకల్లు తాగిన మత్తులో రోడ్డుపై స్పృహలేకుండా పడిపోవడం, దాహంతో నాలుక పిడచగట్టి ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. గతంలో కల్తీ కల్లు బారినపడి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు. కల్తీకల్లుకు వ్యవసనపరులుగా మారుతున్న వారు ప్రాణాలు పోగొట్టుకోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *