న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా కొనసాగుతున్న అయోధ్య కేసులో కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సమావేశమైంది. అయోధ్య కేసు కీలక తీర్పు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై చర్చ జరుగుతోంది. రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఈ కమిటీలో న్యాయమూర్తులు ఎస్ఎ బోబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్‌లు ఉన్నారు. ఈ కేసులో తీర్పు ఇచ్చే ముందు ధర్మాసనం అనేక అంశాలపై చర్చ జరుపుతోంది. చర్చలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును, మధ్యవర్తిత్వ బృందం ఇచ్చిన వివరాలను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకోనుంది. అలాగే సున్నీ వక్ఫ్‌బోర్డు చేసిన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. తుది తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచి విషయం తెలిసిందే. అయోధ్యలోని రామజన్మభూమి – బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే నెల 4 నుంచి 15వ తేదీ లోపు ఎప్పుడైనా వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం. అదే నెల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ పదవీ విరమణ చేయనున్నందున ఆ లోపే తీర్పు వెలువరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. కేసుపై తుది విచారణ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విదేశీ పర్యటనలను కూడా రంజన్ గొగోయ్ రద్దు చేసుకున్నారు. అయోధ్యపై 40 రోజుల పాటు చేపట్టిన విచారణ సందర్భంగా ఎదురైన అభిప్రాయాలపై చర్చించాల్సి ఉందని, విదేశీ పర్యటనకు వెళితే సమయం సరిపోదని రంజన్ గొగోయ్ భావించారు.
