శ్రీకాకుళం: లవేరు మండలంలోని మురపాకలో మంగళవారం ప్రారంభించనున్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని గ్రామస్థులు అడ్డుకుని ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలోని ప్రధాన రహదారిపై మద్యం దుకాణం వద్దంటూ డిమాండ్ చేశారు. దీంతో ఘటనాస్థలాన్ని పోలీసు బలగాలు మోహరించాయి. గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన రహదారిపై మద్యం దుకాణం వద్దంటూ.. గతంలో 2 సార్లు అధికారులకు విన్నవించామని, నిన్న కూడా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించామని చెప్పారు. రహదారిలో కోళ్ళ ఫారం, పోస్టాఫీసు, ఆలయం ఉన్నాయని, స్థానికంగా ఉన్న ఇళ్లల్లోని మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడతారని తెలిపారు. గతంలోనూ మద్యం సేవించేవారి మూలంగా చాలా ఇబ్బందులు పడ్డామని, మహిళలు స్వేచ్ఛగా తిరగలేకపోయారని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థులతో చర్చిస్తున్నారు.
