Breaking News
Home / National / మహా రామాలయం

మహా రామాలయం

ఎత్తు 128 అడుగులు
424 స్తంభాలు- 5 ప్రవేశద్వారాలు
ఇదీ న్యాస్‌- వీహెచ్‌పీ ఆమోదించిన ప్లాన్‌
సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ తరహాలోనే ట్రస్ట్‌
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బాధ్యతలు
మోదీ సూచనల మేరకు సభ్యుల ఎంపిక
గుర్తింపు కోసం వీహెచ్‌పీ తాపత్రయం!
హిందూ, ముస్లిం నేతలతో డోభాల్‌ భేటీ
భవ్య రామ మందిరం
ఎత్తు: 128 అడుగులు
పొడవు: 270 అడుగులు
వెడల్పు: 140 అడుగులు
అంతస్తులు: 2
స్తంభాలు: 424
ప్రవేశద్వారాలు: 5
మందిరం విశేషం ఏమిటంటే
సపోర్ట్‌ బేస్‌లో ఎక్కడా స్టీలు వాడరు

న్యూఢిల్లీ-అయోధ్య: అయోధ్య రాముడికే (రామ్‌ లల్లాకే) వివాదాస్పద స్థలాన్ని కట్టబెడుతూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో ఇక రామాలయ నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఓ ట్రస్ట్‌ ఏర్పరిచి దానికి ఈ నిర్మాణ బాధ్యతను అప్పగించాలన్న కోర్టు సూచన మేరకు కొద్దిరోజుల్లోనే కేంద్రం ఆ దిశగా అడుగు వేయనుంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదించి ట్రస్ట్‌ ఏర్పాటుచేస్తారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ తరహాలోనే అయోధ్య ట్రస్ట్‌ కూడా ఏర్పాటవుతుంది. సోమ్‌నాథ్‌ ట్రస్ట్‌లో మోదీ, అమిత్‌ షాలు కూడా సభ్యులు. కానీ అయోధ్య ట్రస్ట్‌లో వారు ఉంటారా… అన్నది ప్రశ్నార్థకమేనని అంటున్నారు.

ఆలయ ప్రత్యక్ష నిర్మాణ పర్యవేక్షణకు వారు దూరంగా ఉండవచ్చని వినిపిస్తోంది. సోమ్‌నాథ్‌ ట్రస్ట్‌లో ఏడుగురు మాత్రమే సభ్యులు. కానీ అయోధ్య వ్యవహారం పెద్దది కాబట్టి, అనేక సంఘ్‌ పరివార్‌ సంస్థలకు దీనితో సంబంధం ఉన్నవి కాబట్టి సభ్యుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండవచ్చని చెబుతున్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ అభిప్రాయాలను కూడా తీసుకోవచ్చని, సభ్యులను ప్రధాని సూచనల మేరకే ఎంపిక చేస్తారని కూడా తెలుస్తోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్‌ పనిచేస్తుంది. ధార్మిక వ్యవహారాల్లో దిట్ట అయిన రాజకీయ ప్రముఖుడి ఆధ్వర్యంలో ట్రస్ట్‌ ఏర్పాటుచేస్తారని వినిపిస్తోంది. ఆ ట్రస్ట్‌లో అంతా రామజన్మభూమిన్యాస్‌, వీహెచ్‌పీలకు చెందిన వారే ఉండ రు. ఇందులో స్థానం కోసం స్థానికుల నుంచి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

దశాబ్దాలుగా బాల రాముడికి(రామ్‌ లల్లా) పూజలు, సేవలు, అర్చ న, భోగ్‌, సంచలన వ్యవస్థ… ఇవన్నీ చేస్తున్నది అక్కడి హనుమాన్‌ గఢీలోని సాధు సమాజమేననీ, అందుచేత ఈ గఢీ అఖాడా వారితోనే ట్రస్ట్‌ ఏర్పడాలని సాధు సమాజ్‌ డిమాండ్‌ చేస్తోంది. అయోధ్యలోని 13 అఖాడాల్లో ఉన్న సాధు సేవకులే దేవుణ్ని సేవిస్తున్నారు కాబట్టి ట్రస్ట్‌లో వారు ఉండాల్సిందేనన్నది సాధు సమాజ్‌ వాదన. రామాలయ నిర్మాణానికి తీర్పు అనుకూలంగా వస్తే ఆ ఆలయంలో మహంత్‌ ధరమ్‌ దాస్‌ నే ప్రధానార్చకుణ్ణి చేయాలని 2017 డిసెంబరు 29న జరిగిన అఖిలభారత అఖాడా పరిషత్‌ సమావేశంలో నిర్ణయించారని ఆ సమాజ్‌ తాజాగా పేర్కొంది.

ఈ కారణాల రీత్యా ధరమ్‌దా్‌సను తప్పనిసరి గా ట్రస్ట్‌లోకి తీసుకోవాలని కోరింది. 1949 డిసెంబరు 22అర్ధరాత్రి వేళ బాబ్రీ మసీదులో బాలరాముడి విగ్రహాలను రహస్యంగా ప్రతిష్టించిన వారిలో ఒకరైన రామ్‌ఘాట్‌ కోవెల ప్రధాన పూజారి బాబా అభిరామ్‌ దాస్‌ శిష్యుడే ధరమ్‌ దాస్‌. ఈ దృష్ట్యా ధరమ్‌దాస్‌కే అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేసింది. రామజన్మభూమిన్యా్‌సకు నేతృత్వం వహించిన మహంత్‌ రామచంద్రదాస్‌ పరమహంస వారసులు కూడా ట్రస్ట్‌పై కన్నేశారు. వీహెచ్‌పీ నాయకులు కూడా బీజేపీ కేంద్ర నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఆ నమూనానే ఖరారు చేయాలి: అలోక్‌ కుమార్‌
చంద్రకాంత్‌ సోంపురా ఖరారు చేసిన రామాలయ నమూనానే కేంద్రం ఖరారు చేయాలని విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. ‘1980ల్లో అశోక్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు దాన్ని సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా రామ భక్తులకు ఇదే పంపిణీ చేశాం. ఇపుడు దాన్ని మార్చవద్దు’’ అని వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తక్షణం రామాలయ నిర్మాణ కార్యక్రమాలను ఆరంభించాలని ఆయన ఆదివారంనాడు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

ఆలయంలో ఉండేవివే..!
సింహద్వారం, నృత్య మండపం, రంగమండపం, పూజ గదులు, ప్రదక్షిణ ఆవరణతో కూడిన గర్భాలయం… ప్రధానమైనవి.
కథా మండపం, ప్రాంగణ దర్శన మార్గం, ప్రతీక్షాలయ ప్రాంగణం, భోజనాలయం, తులసీ బాగన్‌, యజ్ఞశాల, గోశాల, భోగ, సేవా మండపాలు, వేద గురుకులం, సాధన-ధ్యాన మందిరం… ఇవన్నీ కడతారు.
సాధు సంతువులకు ప్రత్యేక విశ్రమాలయ గదులు, నివాస కేంద్రాలు, వేద పారాయణ కేంద్రం, యాత్రికుల వసతి గృహాలు, అధికార యంత్రాంగానికి ప్రత్యేక భవనాలు… ఇవన్నీ చుట్టూ సేకరించిన 65 ఎకరాల స్థలంలో నిర్మించాలన్నది సూచన.
ఆలయ నిర్మాణానికి 1.75 లక్షల అడుగుల ఇసుకరాయి (శాండ్‌స్టోన్‌) అవసరం పడుతుందన్నది కూడా అంచనా.
రామాలయ నమూనాను కుంభమేళా సమయంలో బహిరంగంగా ప్రదర్శించారు. దీనికి దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు, మహంత్‌లు ఆమోదముద్ర వేశారని వీహెచ్‌పీ చెబుతోంది.
సుప్రీంకోర్టు తీర్పు మాలో ఓ కొత్త ఆశను చిగురింపజేసింది. 1980లో ఆలయనిర్మాణ నమూనాను నేనే రూపొందించాను. గడచిన ఐదేళ్లుగా రామాలయ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇక వేగం పుంజుకొంటాయన్న ఆశ కలిగింది. పనులు వేగవంతం చేస్తాం.
చంద్ర కాంత్‌ సోంపురా, రామాలయ నమూనా రూపశిల్పి

మా శ్రమను గుర్తిస్తారా?
అయోధ్యలోని కరసేవకపురంలో 30 ఏళ్లుగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలోనే రాతి స్తంభాలు, శిల్పాలు చెక్కే పనిసాగుతోంది. సోమ్‌నాథ్‌ ఆలయ రూపకర్త మనవడు చంద్రకాంత్‌ సోంపురా ఈ ఆలయ నమూనాను 1980లో సిద్ధం చేశారు. 200 మంది కార్మికులు, శిల్పులు రోజూ 9గంటల పాటు పనిచేస్తున్నారు. యూపీలోని మీర్జాపూర్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ల నుంచి శిల్పులను తెప్పించి పనిచేయిస్తున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నుంచి ఎర్ర ఇసుకరాయిని తెప్పించి చెక్కిస్తున్నారు. ‘‘75ు పని పూర్తయింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. విరాళాల మీదే ఇప్పటిదాకా ఆధారపడ్డాం’’ అని వీహెచ్‌పీ నేత బిర్జూ యాదవ్‌ చెప్పారు. అయితే ఇపుడు వీహెచ్‌పీ ఆందోళనంతా ఇన్నేళ్ల తమ శ్రమ ను గుర్తిస్తారా, ట్రస్ట్‌లో తమకు భాగస్వామ్యం కల్పిస్తారా, రామాలయ నిర్మాణంలోనూ తమదే ఆధిపత్యం అవుతుందా.. అవదా మొదలైనవి. ‘‘ఏదో ఓ నాటికి రామాలయ నిర్మాణం జరుగుతుందనీ, మనకీ మంచిరోజులు వస్తాయని ఆశపడ్డాం. ఆరోజు వస్తోంది. ప్రభుత్వం మా శ్రమను గుర్తించాలి’’ అని శిల్పుల సంఘం నేత వేద్‌ లాల్‌ అన్నారు.

Check Also

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

Share this on WhatsAppన్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *