నేటి డిజిటల్ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వీడియో గేమ్స్ ఆడుతూ హల్చల్ చేస్తున్నారు. బ్లూవేల్, పబ్ జీ వంటి డేంజరస్ గేమ్స్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా.. వాటికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ పేరిట మరో సరికొత్త గేమ్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు మార్కెట్లోకి వచ్చిన స్వల్ప కాలంలోనే 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ సాధించిన తొలి గేమ్‌గా రికార్డుకెక్కింది.
ఈ మేరకు ఐఓఎస్‌లో 56.9 మిలియన్, ఆండ్రాయిడ్‌లో 45.3 మిలియన్ డౌన్లోడ్లు సాధించిన కాల్ ఆఫ్ డ్యూటీ, ఆయా ప్లాట్‌ఫాంలలో వరుసగా 9.1 మిలియన్, 8.3 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్టిందని తెలిపింది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో లాంచ్ కాకముందే రికార్డు స్థాయిలో డౌన్లోడ్స్ సాధించిన ఈ గేమ్.. అక్కడ కూడా లాంచ్ అయితే గేమింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంచనా వేసింది.