పశ్చిమ గోదావరి : తనను ప్రేమించలేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం ఉదయం పశ్చిమ గోదావరి లో చోటు చేసుకుంది. కళాశాలకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాప్‌లో వేచివున్న యువతిపై కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కవిటం గ్రామానికి చెందిన సుధాకర్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. వాస్తవానికి అప్పటికే అతనికి పెళ్లయింది. భార్యతో విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. ప్రేమించాలంటూ.. యువతి వెంట పడేవాడు కానీ ఆమె సుధాకర్‌ను ప్రేమించేందుకు అంగీకరించలేదు. బుధవారం ఉదయం సదరు యువతి కళాశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుంది. ఈ సమయంలో కత్తితో సుధాకర్ ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. అనంతరం తానూ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ హఠాత్పరిణామంతో విస్తుపోయిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని పాలక్లొల్లు ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
