న్యూఢిల్లీ: ధన్‌తెరాస్, దీపావళి పండుగలు ముగియడంతో మంగళవారం బంగారం ధర భారీ క్షీణతను నమోదు చేసింది. పది గ్రాములకు రూ.548 తగ్గి రూ.38,857కు పడిపోయింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రకారం బంగారం ధరలలో ఈ క్షీణతకు కారణం బలహీనమైన ప్రపంచ ధోరణే. శుక్రవారం బంగారం ధర 10 గ్రాములకు రూ. 39,405 వద్ద ముగిసింది. మరోవైపు, వెండి ధర కూడా భారీగా క్షీణించింది. ఢిల్లీలో కిలోకు రూ. 1,190 రూపాయలు తగ్గడంతో రూ. 47,090కి క్షీణించింది. వెండి ధర శుక్రవారం కిలోకు రూ .48,280 వద్ద ముగియడం విశేషం. పారిశ్రామిక యూనిట్లు, నాణేల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల తగ్గడమే ధర పతనానికి కారణమని తెలుస్తోంది.
దీపావళి తర్వాత ప్రపంచ మార్కెట్లో పతనం దేశీయ మార్కెట్లోనూ కనిపించిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు. అలాగే, భాయ్ దూజ్ కారణంగా అహ్మదాబాద్ వంటి పెద్ద మార్కెట్లు కూడా మూతబడ్డాయి. దీనికి తోడు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒత్తిడికి గురయ్యాయని పటేల్ పేర్కొన్నారు. ఇక, మంగళవారం న్యూయార్క్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,493 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, వెండి ధర ఔన్స్‌కు 17.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.