బెంగళూరు: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌వుమన్ స్మృతి మంధాన సంచలనం సృష్టించారు. వీరిద్దరూ ప్రతిష్ఠాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తం ఐదుగురికి పురస్కారాలు ప్రకటించగా అందులో ఇద్దరు భారతీయులే కావడం గమనార్హం. ఆసియా నుంచి ఫకర్ జమాన్ (పాక్), దిముతు కరుణరత్నె (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గాన్)ను సైతం పురస్కారాలు వరించాయి.
టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సైతం అరుదైన ఘనత పొందాడు. 2019, 2020కి గాను ఏడో ఎడిషన్ వార్షిక సంచికల్లో అతడి గురించి ప్రత్యేక కథనాలు ముద్రించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అతడు ద్విశతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి విజ్డెన్ పురస్కారానికి ఎంపికైన భారత మూడో మహిళా క్రికెటర్ స్మృతి. అంతకన్నా ముందు మిథాలీరాజ్, దీప్తి శర్మ ఈ ఘనత సాధించారు. దిగ్గజ క్రీడకారులైన గుండప్ప విశ్వనాథ్, లాలా అమర్నాథ్ విజ్డెన్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.