Breaking News
Home / States / Telangana / సమన్యాయం కోసం పోరాటం: భట్టి

సమన్యాయం కోసం పోరాటం: భట్టి

అమరావతి న్యూస్, ఖానాపూర్‌(ఆదిలాబాద్‌) : దిశ కేసులో లాగే కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత ఘటనలోనూ సమ న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోరాటం చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన సీఎల్పీ నాయకులతో కలిసి ఎల్లాపటార్‌లోని సంఘటన ప్రాంతాన్ని, ఖానాపూర్‌ మండలంలోని గోసంపల్లెలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నాచితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సమతను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం, హత్య చేయడం అత్యంత పాశవికంగా ఉందన్నారు. ఈ ఘటన అందరినీ కలిచివేసిందన్నారు. మహిళలపై దాడులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రాంలో ఇటీవల కాలంలో సుమారు 15 మందిపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. అత్యాచార ఘటనలన్నింటినీ ఒకేలా చూస్తూ ఒకే కోర్టు ద్వారా విచారించి తక్షణమే శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరపున బాధిత కుటుంబానికి రూ.లక్ష అందజేశారు.

సంఘటితంగా పోరాడుదాం..
అత్యాచారాలు, హత్యలపై సంఘటితంగా పోరాడుదామని సీఎల్పీ నేతలు పేర్కొన్నారు. పాలకులు అగ్రవర్ణాలు, దళితులను వేర్వేరుగా చూడొద్దన్నారు. ఎల్లాపటార్‌ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మద్యం మత్తుతోనే ఇలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామాల్లో బెల్టు షాపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. ఎల్లాపటార్‌ ఘటనను పార్లమెంట్‌లో చర్చించేలా టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ ఘటనలన్నింటినీ ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిదులు కె.విశ్వప్రసాద్, లక్ష్మణ్‌రెడ్డి, లచ్చన్న, మహేశ్, మోహిద్, ఆకుల శ్రీనివాస్, వాల్‌సింగ్, మాజిద్, శంకర్, మహేందర్, సాగర్, శంకర్‌గౌడ్, రవీందర్, శ్రీనివాస్, మల్లయ్య, నారాయణ, ప్రదీప్, గంగాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *