హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ దాఖలుకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నది. మంగళవారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఈ నెల 9 నుంచి మంగళవారం వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 20,630కి చేరినట్టు సమాచారం. దరఖాస్తులు స్వీకరించేందుకు 33 జిల్లాల్లో 34 కేంద్రాలను నెలకొల్పారు. టెండర్లు దాఖలు చేసేవారు నిర్దేశించిన విధంగా ఫారం-ఏ3 (ఏ)లో దరఖాస్తు చేసుకోవాలి. నాన్ రీఫండబుల్ ఫీజు కింద రూ.2 లక్షల డీడీని దరఖాస్తుతో జతచేయాల్సి ఉంటుంది. దుకాణాల సంఖ్యలో మార్పు లేకుండా ప్రస్తుతమున్న 2,216 దుకాణాలనే కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. దరఖాస్తుదారుల నుంచి లాటరీ పద్ధతిలో ఎంపికచేసి దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తుదారులకు టోకెన్ నంబర్లు కేటాయిస్తున్న అధికారులు ఈ నెల 18న డ్రా తీసి మద్యం దుకాణాల లైసెన్స్లు కేటాయించనున్నారు.
