Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మద్యం బాదుడు.. 6వేల కోట్లపైనే!

మద్యం బాదుడు.. 6వేల కోట్లపైనే!

ధరల పెంపు, సాధారణ వృద్ధి, లైసెన్సీల మిగులు
అన్నీ కలిపితే భారీగానే ఆదాయం
వినియోగంపై ధరల పెంపు ప్రభావం ఉండదు!
సమయం తగ్గింపు బెల్టుకు దారి తీసే అవకాశం
అమరావతి: ‘వినియోగం తగ్గించేందుకే ధర పెంచాం. అందుబాటులో లేకుండా చేసేందుకే సమయమూ తగ్గించేశాం. మద్యపాన నిషేధం దిశగా మేం వేస్తున్న అడుగులివి’.. అని ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్నా.. ఆచరణలో సర్కారు చెబుతున్న ఆశయం నెరవేరే సూచనలేవీ కనిపించడం లేదు. పైగా ఖాళీ ఖజానాను నింపేందుకే ధరల పెంపు ఉపయోగపడుతుందనే వాదన వినిపిస్తోంది. ధరల పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఆరు వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమయం తగ్గింపు విధానం బెల్టు షాపులకు దారితీయొచ్చనే వాదనా వినిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ శాఖ రాష్ట్రంలో రూ.20వేల కోట్ల మద్యాన్ని విక్రయించింది. అందులో రూ.17,500 కోట్లు ప్రభుత్వానికి మిగిలింది. సాధారణంగా ఏటా మద్యంపై 7 నుంచి 10 శాతం వృద్ధి ఉంటుంది.

ఈ ఏడాది షాపులు తగ్గించడం వల్ల అది 5 శాతానికి పరిమితం కావొచ్చని భావించారు. అయితే ధరలు పెంచిన నేపథ్యంలో సాధారణ వృద్ధితో సంబంధం లేకుండా ఆదాయం భారీగా పెరగనుంది. తాజా ధరల పెంపుతో సుమారు 20శాతం అదనంగా వస్తుందనేది అంచనా. అయితే ఇది బ్రాండ్‌ను బట్టి మారుతుంది. ఖరీదైన మద్యం అయితే పెంపు స్వల్పంగానే ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడుపోయేది చీప్‌ లిక్కర్‌, మీడియం బ్రాండ్లే. అందువల్ల సగటున చూస్తే పెంపు 20శాతం ఉంటుందని అంటున్నారు. అంటే గతేడాది వచ్చిన రూ.20వేల కోట్లలో 20శాతం రూ.4వేల కోట్లు అవుతుంది. దీనికి సాధారణ వృద్ధి 5శాతాన్ని కలుపుకొంటే ఇంకా పెరుగుతుంది. ఇవిగాకుండా గతంలో లైసెన్సీలకు ఇచ్చే 10 శాతం మార్జిన్‌ రూ.2వేల కోట్లు ప్రభుత్వానికే మిగులుతుంది. ఇందులో నిర్వహణకు రూ.800 కోట్లు తీసేసినా రూ.1200 కోట్లు సర్కారుకు మిగులే ఉంటుంది. ధరల పెంపు, సాధారణ వృద్ధి, లైసెన్సీల రూపేణా మిగిలే మొత్తం మూడూ కలిపితే ఎంత లేదన్నా రూ.6వేల కోట్లు దాటిపోతుందనేది ఎక్సైజ్‌ వర్గాల అంచనా.

రాత్రి 8 దాటాక మందే ఉండదా?
మందు తాగేవారి సంఖ్య తగ్గాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్యం షాపుల పని వేళలు తగ్గించినా అది బెల్టులకు దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా సమయం తగ్గడం వల్ల 8 గంటల తర్వాత తాగేవారందరికీ బెల్టు షాపులే దిక్కు కానున్నాయి. ప్రభుత్వ షాపుల సిబ్బంది ఒకేసారి బెల్టులకు మద్యం తరలించకపోయినా.. పరిమితిని పాటిస్తూనే సీసాలు కొనుగోలు చేసి అనధికారికంగా అమ్ముకునే వీలుంది. ఒకసారి ఒకరికి మూడు సీసాలకు మించి అమ్మకూడదనేది నిబంధన. కానీ ఎన్నిసార్లు కొనుక్కోవాలనే దానిపై ఎలాంటి నిబంధన లేదు. దీంతో రెండు మూడు సార్లు మూడేసి ఫుల్‌ బాటిళ్లు కొనుగోలు చేసినా రాత్రి బెల్టు నడపొచ్చని అంటున్నారు.

ఈ పెంపు వినియోగం తగ్గిస్తుందా?
సాధారణంగా మద్యం ధరల పెంపు అంటే విలు వ ఆధారంగా ఉంటుంది. రూ.వంద సీసాపై ఒకలా ఉంటే, రూ.వెయ్యి సీసాపై మరోలా ఉంటుంది. కానీ ప్రభుత్వం పెంచిన తాజా ధరల్లో వినియోగదారులందరినీ ఒకే గాటన కట్టారు. రూ.వెయ్యితో ఒక ఫు ల్‌ బాటిల్‌ కొన్నవారిపై రూ.80 భారం పడితే, రూ.400తో ఫుల్‌ కొన్నవారిపైనా రూ.80 భారమే ప డుతుంది. దీనివల్ల మద్యం ఎక్కువ పరిమాణంలో తాగే సామాన్య వినియోగదారులపై ఎక్కువ భారం పడుతుంది. ధరల పెంపుపై మరో వాదన కూడా వినిపిస్తోంది. నిజంగా మద్యానికి దూరంగా ఉంచాలనే ప్రయత్నమే అయితే ధరలు ఇంకా భారీగా పెంచాల్సిందని, అప్పుడు రెండు బాటిళ్లు తాగేవారు ఒక దానితో ఆగిపోయేవారని అంటున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *