ఇంటర్నెట్‌డెస్క్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుత క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డిబ్రుయిన్, బవుమాలను ఔట్ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో డిబ్రుయిన్, డుప్లెసిస్, ఫిలాండర్లను పెవిలియన్ చేర్చాడు. వికెట్ల వెనుక పాదరసంలా కదలాడి మొత్తం ఐదు క్యాచ్‌లు ఒడిసిపట్టాడు. తొలి టెస్టుకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ యువకీపర్ రిషభ్‌పంత్‌కు బదులు సాహాని తుది జట్టులోకి తీసుకున్నామని, అతడిపై తనకు పూర్తి నమ్మకముందని చెప్పాడు. తన దృష్టిలో ప్రపంచ అత్యుత్తమ కీపర్ సాహా అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ సాహా రెండో టెస్టులో అదరగొట్టి అభిమానుల మనసులు గెలిచాడు.
మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో స్థానం కోసం ఎదురు చూస్తున్న సంజూశాంసన్ విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో టెస్టుల్లో సాహా పరిమిత ఓవర్ల క్రికెట్లో సంజూ తమదైన ముద్ర వేశారు. ఇద్దరి మధ్య పంత్ పరిస్థితి దారుణంగా తయారైందని సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయి. అతడిని ట్రోలింగ్ చేస్తూ వివిధ మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు నెటిజెన్లు. రెండో టెస్టులో టీమిండియా సమష్టి కృషితో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, కోహ్లీ (254*), మయాంక్ అగర్వాల్(108), జడేజా(91) రాణించడంతో 601/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు, ఫాలోఆన్‌లో 189 పరుగులకు కుప్పకూలింది.